మయన్మార్‌లో ఇద్దరు జర్నలిస్టులకు ఏడేండ్ల జైలు

మయన్మార్‌లోని రఖీనే స్టేట్‌లో మైనారిటీ రోహింగ్యాలపై అణిచివేతకు సంబంధించిన వార్తలు ఇద్దరు పాత్రికేయులను జైలుకు పంపాయి. రోహింగ్యాలు చెల్లాచెదురై ఇరుగుపొరుగు దేశల్లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. వీరిపై సైన్యం చేపడుతున్న చర్యలు ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు గురవుతున్నాయి.

ఇందుకు సంబంధించిన వార్తలు సేకరించిన రాయిటర్స్ జర్నలిస్టులు వాలోన్ (32), క్యాసోవూ (28) లపై బ్రిటిష్ కాలంనాటి మయన్మార్ అధికార రహస్యాల కేసుపెట్టారు. వీరిని గత డిసెంబర్ లో అరెస్ట్ చేసారు. సెక్షన్ 3.1సీ నిబంధలను ఇద్దరూ ఉల్లంఘించారని కేసు విచారించిన న్యాయమూర్తి ఎల్విన్ నిర్ధారించారు. ఇద్దరికీ ఏడేండ్ల జైలుశిక్ష విధించారు.

పోలీస్ లు చట్టాతీత హత్యల గురించి తాము వివరాలు సేకరించడంతో ఈ కేసు తమపై రుద్దారని వారు ఆరోపిస్తున్నారు. తమను ఒక  హోటల్‌లో తేనీరుకు ఆహ్వానించి, తమకు కొన్ని పత్రాలు అందజేసి, బయటకు రాగానే రహస్య పత్రాలు కలిగి ఉన్నామని అరెస్ట్ చేసారని పేర్కొంటున్నారు. ఈ అరెస్ట్ ల పట్ల ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇది మీడియా స్వేచ్ఛకు చీకటి రోజని రాయిటర్స్ వార్తా సంస్థ విమర్శించింది.