ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో భాగస్వామి అవుదామనే బిజెపిలోకి

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో భాగస్వామి అవుదామని బీజేపీలో చేరుతున్నట్లు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ  పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రకటించారు. ఈమేరకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ సమర్పించినట్లు పొంగులేటి సుధాకర్‌ రెడ్డి వెల్లడించారు. రాహుల్‌ గాంధీ తెలుగు రాష్ట్రాల పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా గత 27 ఏళ్ల నుంచి వివిధ దశల్లో సద్భావనా యాత్రలు చేశామని గుర్తు చేసుకున్నారు. ఇందుకు ఫలితంగా పీస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అమెరికా కింగ్స్‌ విశ్వవిద్యాలయం ద్వారా డాక్టరేట్‌ సైతం తనకు ప్రదానం చేసిందని తెలిపారు. సర్జికల్ స్ట్రయిక్స్ పై కాంగ్రెస్ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని ధ్వజమెత్తుతూ  మరోసారి మోదీ ప్రధాని కావడం ఖాయమని  చేశారు.

దిల్లీలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. శతాబ్దాల క్రితం పుట్టిన పార్టీలో మధ్యవర్తుల ప్రమేయం వల్ల తన లాంటి ఎంతో మంది కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని వివరించారు.

కాంగ్రెస్‌లోని కొందరు పెద్దలు నాయకుల ఎంపికకు డబ్బులనే ప్రామాణికంగా చూస్తుండడం వల్ల కలత చెందానని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేసేవారికి టికెట్లు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సొంత తప్పిదాలతో ఓడిపోయి ఈవీఎంలపై నెపం నెట్టారని, ఇప్పుడు అవే లోపాలతో లోక్‌సభ ఎన్నికలకు వెళ్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాతనైనా పీసీసీని మార్చలేదని, అదే మొహాలతో లోక్‌సభ ఎన్నికలకు వెళితే ఎవరు ఓట్లువేస్తారని పొంగులేటి ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌ పార్టీలో 40 ఏళ్లుగా వివిధ హోదాల్లో పని చేశానని, కరడు గట్టిన కాంగ్రెస్‌ వాదిగా ఉన్న తాను తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీలో చేరుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో ప్రస్తుతం ఉన్న లోపాలు, దిద్దుబాటు చర్యల్లో విఫలం కావడం సహా ఇంకా అనేక విషయాల్లో కలత చెంది బాధాతప్త హృదయంతో పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు.