మోదీ మళ్ళి అధికారంలోకి రాకపోతే ప్రమాదంలో దేశం

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాకపోతే దేశం ప్రమాదంలో పడుతుందని మధుర ఎంపీ హేమమాలిని హెచ్చరించారు. మోదీ ఉంటేనే దేశం అభివృద్ధి సాధిస్తుందని ఆమె స్పష్టం చేశారు. 

యూపీలోని మధుర లోక్‌సభ నుంచి తిరిగి పోటీ చేస్తున్న హేమమాలిని ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోశారు. మోదీ ఈ ఐదేళ్లూ దేశానికి అవినీతి రహిత పాలన అందించారని ఆమె చెప్పారు. ‘మోదీని మళ్లీ గెలిపించుకోవల్సిన అససరం ఎంతైనా ఉంది. మరో దారి లేదు. ఆయన ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాకపోతే దేశం ప్రమాదంలో పడినట్టే’ అని హేమమాలిని తెలిపారు. బీజేపీని మళ్లీ అధికారంలోకి రావడానికి నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. 

మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలుచేసిందని ఆమె చెప్పారు. దమ్మూ, ధైర్యం ఉన్న ప్రభుత్వం కేంద్రంలో ఉందని ఆమె పేర్కొన్నారు. గత ప్రభుత్వాలకు ముందుచూపు, చిత్తశుద్ధి ఉండేదికాదన్న హేమ మోదీ ప్రభుత్వం ప్రజలకు భిన్నమైన పాలన అందిస్తోందని చెప్పారు. ప్రతిపక్షాలు అదేపనిగా మోదీ పాలనపై ఆరోపణలు చేస్తున్నాయని ఆమె విరుచుకుపడ్డారు. 

బీజేపీ నేతలు, కేడర్ తమ పేర్లకు ముందు ‘చౌకీదార్’ చేర్చుకుంటే మీ పేరు ముందు లేదేమని అడగ్గా ‘నేనూ చౌకీదార్‌నే అని బదులిచ్చారు. ఆఫ్‌కోర్స్ నేను చౌకీదారిణిని అంటూ నవ్వేశారు. ‘మా ప్రధాని చౌకీదార్. కాబట్టి మేం అందరమూ ఆయన బాటలోనే నడుస్తాం’ అని మధుర బీజేపీ ఎంపీ స్పష్టం చేశారు. మోదీ అవినీతి రహిత పాలన అందిస్తుంటే ప్రతిపక్షాలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయని ఆమె ఆరోపించారు. 

కృష్ణ భగవానును జన్మస్థానంలో తనకు, మోదీకే ప్రజలు ఓట్లేస్తారని విశ్వాసం ఆమె వ్యక్తం చేశారు. తనతోపాటు బీజేపీ లంతా ఆయా నియోజకవర్గాల అభివృద్ధికి పాటుపడ్డామని హేమ పేర్కొన్నారు. ‘బాలీవుడ్ నటిని కాబట్టి ఓట్లు అడగడం లేదు. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల పథకం, ఆయుష్మాన్ భారత్ యోజన, మరుగుదొడ్ల నిర్మాణం వంటి పథకాలు చూసి ఓటు వేయమని అభ్యర్థిస్తున్నా’ అని ఆమె తెలిపారు. 

మధుర నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేస్తున్న హేమమాలిని ఈ ఎన్నికలే తనకు ఆఖరివని నామినేషన్ దాఖలు సందర్భంగా ప్రకటించారు. మధురలో హేమమాలినిపై ఆర్‌ఎల్‌డీ అభ్యర్థి కన్వర్ నరేంద్ర సింగ్ పోటీ చేస్తున్నారు.