బెయిల్‌పై ఉన్నోళ్లు.. కాపలాదారుడినే నిందిస్తారా..?

'బెయిల్‌పై ఉన్నవాళ్లు.. కాపాలదారుడినే నిందిస్తారా’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కొందరు ఢిల్లీలో కూర్చుని పన్నులు ఎగ్గొడుతున్నారు. రైతులు భూములు లాక్కున్నారు. పత్రికా కార్యాలయం కోసం  ప్రభుత్వం ఇచ్చిన భూమిని లీజుకు ఇచ్చి డబ్బు సంపాదించుకున్నారు. రక్షణ ఒప్పందాల్లో కమీషన్లు తీసుకున్న వారు ఉన్నారు. వీరు కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకొని బయట తిరగుతున్నారు. బెయిల్‌పై తిరుగుతున్న వీరే.. కాపాలదారుడిని నిందిస్తున్నారు.’ అని దుయ్యబట్టారు.  

అరుణాచల్ ప్రదేశ్, అసోంలో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార సభల్లోప్రధాని పాల్గొంటూ  కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాపై ఉన్న కేసులను ప్రస్తావిస్తూ ఈ విధంగా వ్యాఖ్యానించారు. అగస్టా కుంభకోణాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తూ ఈ కేసులో క్రిస్టియన్ మిచేల్‌ను రప్పించామని చెప్పారు. అవినీతిని పూర్తిగా అంతం చేయడానికి ఈ కాపాలదారుడికి అందరూ మద్దతుగా నిలవాలని కోరారు.

అధికారంలో ఉన్నప్పుడు ఈశాన్య భారతాన్ని కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఈశాన్య భారతం ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించడానికి ఈ కాపాలదారుడు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అవినీతి, ఉగ్రవాదంపై నిరంతర పోరాడుతున్నామని తెలిపారు. ఈ ఎన్నికల్లో బలమైన కాపలాదారుడు ఒక పక్క. మరోపక్క కుటుంబాలతో కూడిన కల్తి కూటమి ఉందని చెప్పారు.

అరుణాచల్ ప్రదేశ్‌కు ఆధునిక మౌలిక సదుపాయాలు అవసరమని నిపుణులు దశాబ్దాల తరబడి నుంచి చెబుతున్నా.. ఆ కుటుంబం తన సన్నిహితుల కోసమే పని చేస్తూ ప్రజలను పట్టించుకోలేదన్నారు. ప్రజా సంక్షేమం కన్నా తమ సొంత లాభం కోసమే వారు పాటుపడ్డారని ఆరోపించారు. 

మిషన్ శక్తి ని కూడా ఎగతాళి 

యాంటీ శాటిలైట్ మిసైల్ ప్రయోగంపై ప్రతిపక్షాలు విమర్శిస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ యాంటీ శాటిలైట్ ప్రయోగంలో శాస్త్రవేత్తలు విజయం సాధిస్తే, వారిని అభినందించకుండా.. ప్రతిపక్ష నేతలు ఎగతాళిగా మాట్లాడుతున్నారని రాహుల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ పరీక్ష విజయవంతం కావడం మన దేశానికి గర్వకారణమన్న విషయాన్ని మరిచి.. ప్రతిపక్ష నేతలు ఉగ్రవాదుల భాష మాట్లాడుతున్నారని విమర్శించారు.

పాకిస్థాన్‌లోని బాలా కోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై సైన్యం నిర్వహించిన వైమానికదాడుల విషయంలోనూ విమర్శిస్తున్నారని తెలిపారు. వైమానికదాడులను ప్రశ్నిస్తున్న నేతల ఫొటోలను పాకిస్థాన్ పత్రికల్లో ప్రచురిస్తున్నారని చెప్పారు. మన దేశ ప్రతిపక్ష నేతలకు పొరుగు దేశంపై ప్రేమాభిమానాలు పెరిగి పోయాయని ఎద్దేవా చేశారు.

మన దేశాన్ని విమర్శిస్తున్న స్థాయిలో పొరుగు దేశాన్ని ప్రేమిస్తున్నారని మండిపడ్డారు. తన  పాలనలో తీవ్రవాదులు, కాంగ్రెస్ నేతలు తప్ప దేశ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని మోదీ తెలిపారు.  వారికి ఈ ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. 

ఈ సందర్భంగా పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించడంలో ఆనాటి ప్రధాని ఇందిరకు ప్రతిపక్ష జనసంఘ్ (బీజేపీ పూర్వరూపం) ప్రముఖ నేత అటల్ బిహరీ వాజ్‌పేయ్ అన్ని విధాలుగా అండగా నిలిచిన విషయాన్ని  గుర్తు చేశారు. 1962లో చైనా ఆక్రమించడానికి ప్రయత్నించిన సమయంలో సైన్యంతో కలిసి తేజ్‌పూర్ ప్రజలు సంయుక్తంగా ఎదుర్కున్నారని ప్రశంసించారు. బీజేపీని గెలిపిస్తే.. చొరబాటుదారులు, ఉగ్రవాద రహిత రాష్ట్రంగా అసోంను నిలుపుతామని హామీ ఇచ్చారు. 

ఆరు తెగలకు ఎస్టీ హోదా 

అసోం ప్రజల హక్కులను, సంస్కృతిని, ప్రయోజనాలను కాపాడుతామని చెబుతూ ఆరు తెగలకు ఎస్టీ హోదా కల్పిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని తాయ్ అహోం, ముత్తాక్, మొరన్, చుటియా, కోచ్ రాబ్బాంగ్ప్‌స్, టీ గిరిజనులకు హోదా కల్పిస్తామని తెలిపారు.

మాకు మద్దతుగా నిలిచిన పేద గిరిజనుల అభ్యున్నతికి అన్ని చర్యలు తీసుకుంటామని, వారి సమస్యలను ఈ చాయ్‌వాలా అర్ధం చేసుకొని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. టీ తెగలకు సంబంధించి ఉచితంగా బియ్యం అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.