యూపీయే అవినీతిని ఓ ఆదర్శ లక్ష్యంగా మార్చింది


కర్ణాటకలోని కాంగ్రెస్, జేడీఎస్ నేతలు అవినీతిని ఆదర్శ లక్ష్యంగా మార్చుతున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఆరోపించారు. ఆదాయపు పన్ను శాఖ కార్యాలయం వద్ద కాంగ్రెస్, జేడీఎస్ నేతలు శుక్రవారం ధర్నా చేసిన నేపథ్యంలో జైట్లీ శనివారం ఓ బ్లాగ్ పోస్ట్‌ రాశారు.

కర్ణాటకలోని జేడీఎస్, కాంగ్రెస్ నేతల ఇళ్లు, ఇతర సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ సోదాలను నిరసిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార స్వామి, ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర, ఇతర నేతలు శుక్రవారం ధర్నా నిర్వహించారు. బెంగళూరులోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయం ఎదుట ఈ ధర్నా జరిగింది.

జైట్లీ తన బ్లాగ్ పోస్ట్‌లో ఈ పరిణామాలను తీవ్రంగా ఖండించారు. బెంగళూరులోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయం ఎదుట 2019 మార్చి 28న ధర్నా నిర్వహించడం ద్వారా యూపీయే అవినీతిని ఓ ఆదర్శ లక్ష్యంగా మార్చిందన్నారు. ఈ సోదాలు రాజకీయ నాయకులపై కానీ, మంత్రులపై కానీ, ఎంపీలపై కానీ జరగలేదని స్పష్టం చేశారు. ఈ సోదాలకు రాజకీయ ఉద్దేశాలేవీ లేవని తెలిపారు. అలాంటపుడు ఎందుకింత రభస చేస్తున్నారని ప్రశ్నించారు.

కచ్చితంగా అవినీతే వారి ఆదర్శ లక్ష్యమని ఆరోపించారు. ఆ రెండు పార్టీల నేతల వ్యవహార శైలి అనుమానాలకు తావిస్తోందని ధ్వజమెత్తారు. మంత్రి గారి మేనల్లుడు పీడబ్ల్యూడీ కాంట్రాక్టరేనా? ఆయనకు బహుమతులు ఇచ్చారా? అది బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతమా? అని అడిగారు. ఈ ప్రశ్నలకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి జవాబు చెప్పవలసి ఉందని స్పష్టం చేశారు. 

పీడబ్ల్యూడీ అధికారులు, కాంట్రాక్టర్లు, ఇంజినీర్లు, ధర్నా చేసిన రాజకీయ నేతల మధ్య ఏదో అనుబంధం ఉందని ఆరోపించారు. వారికి ఆర్థిక ప్రయోజనాలేవైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు పీడబ్ల్యూడీ నిధులు చెల్లిస్తూ ఉంటే, ఇంజినీర్లు కలెక్షన్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారా? ఆ ఏజెంట్ల యజమానులు నిరసనకారులుగా మారారా? అని ప్రశ్నించారు. రాజ్యాంగపరమైన సమాఖ్య స్ఫూర్తికి కర్ణాటక కట్టుబడి ఉండాలని హితవు చెప్పారు.