నామినేషన్‌కు ముందు అమిత్‌షా భారీ ర్యాలీ

గుజరాత్‌లోని గాంధీనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగుతున్న భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా నేడు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. నామినేషన్‌ వేయడానికి ముందు అమిత్‌ షా భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ‘విజయ్‌ సంకల్ప్‌ సభ’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ర్యాలీకి పలువురు ఎన్డీయే నేతలు హాజరయ్యారు. 

కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్ గడ్కరీ, పీయూష్‌ గోయల్‌, రామ్‌ విలాస్ పాసవన్‌, శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాకరే, శిరోమణి అకాలీదళ్‌ నేత ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ తదితరులు ఈ విజయ్‌ సంకల్ప్‌ సభలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ.. ‘అగ్రనేత ఎల్‌ కే అడ్వాణీ ప్రాతినిధ్యం వహించిన గాంధీనగర్‌ నుంచి పోటీ చేయడం గర్వంగా భావిస్తున్నా’ అని తెలిపారు. అంతకుముందు అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ విగ్రహానికి అమిత్ షా నివాళులర్పించారు.

గాంధీనగర్‌ నుంచి అడ్వాణీ ఆరు సార్లు ఎంపీగా గెలిచారు. అయితే వయోభారం రీత్యా ఈ ఎన్నికల్లో అడ్వాణీకి రాజకీయ విశ్రాంతి కల్పించిన విషయం తెలిసిందే. దీంతో ఆ స్థానంలో పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా బరిలోకి దిగుతున్నారు. గతంలో ఇదే లోక్‌సభ నియోజకవర్గంలోని సర్కేజ్‌, నరన్‌పురా అసెంబ్లీ స్థానాల నుంచి అమిత్ షా ఎమ్మెల్యేగా గెలుపొందారు.