300కు పైగా సీట్లతో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం

ప్రస్తుత ఎన్నికలలో తమకు చెప్పుకో దాగిన పోటీయే లేదని, బిజెపికి 2014లో కన్నా ఎక్కువ సీట్లు వస్తాయని, 300కు పైగా సీట్లతో ఎన్డీయే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. 

రిపబ్లిక్ భారత్ న్యూస్ ఛానల్ ఎడిటర్- ఇన్-చీఫ్ అర్నాబ్ గోస్వామికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎన్డీయే విజయావకాశాలపై ఆయన మాట్లాడారు. గతంలో మోదీ ఎవరన్న కొన్ని సందేహాలు ప్రజలకు ఉండేవని, అయితే ఇప్పుడు .. దేశ భద్రత, పేద ప్రజల సమస్యలు సహా పలు అంశాల్లో మోదీ ఏం చేశారనేది ప్రజలకు తెలుసునని తెలిపారు. 

ఈ అసలు పోటీ అనేదే లేదన్నారు. 2014 ఎన్నికల కంటే మెరుగైన తీర్పును ప్రజలు ఇవ్వబోతున్నారని, బీజేపీ పూర్తి మెజారిటీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

దేశ ప్రజలు సంపూర్ణ మెజారిటీ కలిగిన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని, 30 ఏళ్ల అస్థితరతను, ఐదేళ్ల మోజారిటీ ప్రభుత్వాన్ని ప్రజలు చూశారని, ఇవాళ దేశాన్ని అస్థిరత వైపు తీసుకువెళ్లాలని దేశ ప్రజలు కోరుకోవడం లేదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అనువంశిక పాలన అనేది ప్రజాస్వామ్యానికి ప్రమాదమని, అది కాంగ్రెస్ కావచ్చు, మాయావతి కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చని హెచ్చరించారు. 

‘పేదరికాన్ని తొలగిస్తామంటూ ఒకే కుటుం బానికి చెందిన 4 తరాలవారు చెబుతూ వచ్చారు. ఇందిరా గాంధీ మాట్లాడారు. రాజీవ్ గాంధీ కూడా మాట్లాడారు. ఇప్పుడు రాహుల్ గాంధీ సైతం పేదరికనాన్నితొలగిస్తా మంటూ మాటలు చెబుతున్నారు’ అంటూ గాంధీ కుటుంబాన్ని  మోదీ ఎద్దేవా చేశారు. 

డిఫెన్స్ ఒప్పందాల విషయంలో గత ప్రభుత్వాలు మురికి అంటించుకున్నాయంటూ కాంగ్రెస్‌పై ఆరోపణలు చేశారు. మన దేశంలో గత ప్రభుత్వాలకు డిఫెన్స్ డీల్స్ అనేవి ఒక ఎటీఎం తరహాలా ఉండేవని, గత కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ ఈ ఏటీఎంలను ఉపయోగించుకున్నాయని ధ్వజమెత్తారు. డిఫెన్స్ ఒప్పందాలు పారదర్శకంగా, నిజాయితీగా చేయవచ్చని కాంగ్రెస్ ప్రభుత్వాల ఊహామాత్రంగా కూడా అనుకోలేదని, తమ స్వప్రయోజనాలే కానీ బలగాల ప్రయోజనాలపై వారికి ఎలాంటి పట్టింపులు లేవంటూ మండిపడ్డారు. 

తాను చురుకైన ప్రధాని కావడం, ప్రజల మధ్యే ఉంటూ పనిచేయడంతో అందరి దృష్టి తనపైనే కేంద్రీకృతమైందని మోదీ చెప్పుకొచ్చారు. ‘ప్రజలు నాకో జాబ్ ఇచ్చారు. నా కోసం నేను బతికే హక్కు నాకు లేదు. ఎంతవరకూ నన్ను ఆ జాబ్లో ఉంచుతారో అంతవరకూ నేను ప్రజల కోసం జీవించాలి. అలాగా జీవిస్తానని కూడా వాగ్దానం చేస్తున్నాను’ అని ఆయన భరోసా ఇచ్చారు. అలాగే బాధ్యత కలిగిన పౌరుడిగా, బాధ్యత కలిగిన రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిగా, బాధ్యతాయుతమైన ప్రధానిగా తాను ప్రజలందరినీ కలుపుకొని పనిచేస్తానని స్పష్టం చేశారు.