కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పాటు తథ్యం

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో ప్రజలకు ఇప్పటికే తెలిసిపోయిందని..కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పాటు తథ్యమని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ స్పష్టం చేశారు. శుక్రవారం నెల్లూరులో  బిజెపి జిల్లా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొంటూ దేశప్రజలంతా మోదీ వైపే ఉన్నారని తెలిపారు. 

దేశవ్యాప్తంగా తమ ప్రాంతం నుంచి పోటీ చేయాలంటూ ఆయన్ని కోరుతున్నారని చెప్పారు. అదే..రాహుల్‌ గాంధీ ఎక్కడ నుంచి పోటీ చేస్తే గెలుస్తామని ఆరా తీస్తుండగా..ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ ప్రాంతం నుంచి పోటీ చేయొద్దని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. 

 పట్టుమని పదిసీట్లు కూడా దక్కించుకోలేని కేసీఆర్‌ ప్రధానమంత్రి అవుతానని చెప్పడం హాస్యాస్పదమని ధ్వజమెత్తారు. ఏపీలో అసమర్థ, అవినీతి, కుటుంబ పాలన నడుస్తోందని పేర్కొంటూ దేశాన్ని రక్షిస్తానని తిరుగుతున్న చంద్రబాబు ముందు రాష్ట్రంలో  గెలుపు చూసుకోవాలని హితవు చెప్పారు. 

ఈ రాష్ట్రంలో ఏప్రిల్ 11న జరగనున్న ఎన్నికలు దేశాన్ని ధర్మబద్ధంగా పరిపాలిస్తున్న బిజేపికి, అధర్మబద్ధంగా, అవినీతి పరిపాలన చేస్తూ రాష్ట్ర ప్రజల ధనాన్ని కొల్లగొడుతున్న తెలుగుదేశం పార్టీకి మధ్య యుద్ధమని స్పష్టం చేశారు.  దేశంలోని ప్రాంతీయ పార్టీల నాయకులు మహాకూటమి పేరుతో మోదీని గద్దె దించాలనే కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో అన్ని స్థానాల్లో మోదీయే పోటీ చేస్తున్నట్లు భావించి బిజేపి తరఫున ఏ అభ్యిర్థి బరిలో ఉన్నా ఓటు వేసేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 

తెలుగుదేశం పార్టీలాంటి ప్రాంతీయ పార్టీలు ఇంటి పేరుని చూసి అభ్యర్థిని, సీటును కేటాయిస్తాయని, కాని స్వాతంత్య్రం వచ్చిన తరువాత తొలిసారిగా మోదీ కార్యకర్తలనే అభ్యర్థులుగా నిలిపి బరిలో దించారని పేర్కొన్నారు. 

బీసీలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించి వారికి చట్టబద్ధత కల్పించిన ఏకైక ప్రభుత్వం బీజేపీయేనని గుర్తుచేశారు. పార్టీ కోసం పనిచేసే వారికే తమ పార్టీలో గుర్తింపు ఉంటుందని చెప్పారు. తెలంగాణలో 10 సీట్లు కూడా దక్కించుకోలేని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నేను కింగ్ మేకర్‌ని అని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ దగ్గర ధన, దాదాగిరి, గూండాగిరి, అధికార యంత్రాంగం ఉందని, మనకు బీజేపీ, మోదీ అండగా ఉన్నారని తెలిపారు. 

కుంభకోణాలు, తీవ్రమైన అవినీతి, కుటుంబ పాలన, అసమర్ధపాలనతో విసిగి ఉన్న ప్రజలు త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు చేతకాని పాలనకు స్వస్తి చెప్పనున్నారని పిలుపిచ్చారు. పుల్వామా దాడిపై భారత సైనికులకు ఆత్మస్ధైర్యాన్ని కల్పించాల్సింది పోయి పాకిస్తాన్‌కు మద్దతు తెలిపిన చంద్రబాబుకు దేశంలో నివసించే హక్కు ఎక్కడ ఉందని నిలదీశారు. మోదీ హయాంలో దేశం భద్రంగా ఉందన్నారు. 

దేశంలోని కొన్ని ప్రాంతీయ పార్టీల నాయకులతో చంద్రబాబు చేతులు కలిపి మహాకూటమిని ఏర్పాటు చేశారని, ఆ కూటమిలో ఉన్న పార్టీలకే ఇప్పుడు పొత్తులు కుదరడం లేదని ఎద్దేవా చేశారు. అలాంటి అవినీతి రాజకీయ నాయకులు ఎంతమంది కలిసినా మోదీ విజయాన్ని అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఉన్న తెలుగువారే అక్కడి సిఎం కేజ్రీవార్‌కు ఓటెయ్యరని, అలాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి చంద్రబాబుకు ఓటెయ్యండి చెప్పడం హాస్యాస్పదమన్నారు. 

బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క కాశ్మీర్ తప్పించి ఇప్పటి వరకు ఉగ్రదాడులు, బాంబు దాడులు, మత కలహాలు జరిగిన దాఖలాలే లేవన్నారు. భారతావనిని అగ్రరాజ్యాల సరసకు తీసుకెళ్లిన ఘనత ప్రధాని మోదీదే అని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం అత్యంత శక్తివంతమైన, ఒక సమృద్ధికరమైన దేశంగా తీర్చిదిద్దుతుంది అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదని తెలిపారు. 

కేంద్రం ఐదున్నర లక్షల కోట్లు నిధులను మంజూరు చేసినా ఏ ఒక్కపైసాకి ఇప్పటి వరకు రాష్ట్రప్రభుత్వం లెక్క చూపలేదని ధ్వజమెత్తారు. రాజధానిలో ఇప్పటికీ ఒక భవంతి పూర్తి కాలేదని వెల్లడించారు. సీఎం తనయుడు లోకేష్‌కు దోచిపెట్టడానికే అధికారాన్ని చంద్రబాబు వినియోగిస్తున్నారని దుయ్యబట్టారు.

అమరావతిలో ఎక్కడైనా ఒక్క రోడ్డు కూడా సరిగా నిర్మించిన దాఖలాలే లేవన్నారు. విభజన చట్టంలోనే ప్రత్యేక హోదా లేకుండా చేసింది ఆనాటి కాంగ్రెస్‌తో నేడు చంద్రబాబు జతకట్టారని మండిపడ్డారు. కేంద్రంలోనే కాక రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారం చేజిక్కించుకోనుందని ఆయన జోస్యం చెప్పారు.