సూర్యోదయం కావాలా.. పుత్రోదయం కావాలా?

తన ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల ద్వారా  సూర్యోదయ ఆంధ్రప్రదేశ్‌ కావాలా లేదా కేవలం తన కుమారుడు, బంధువులు, సన్నిహితుల కోసమే పనిచేస్తున్న చంద్రబాబు ద్వారా  పుత్రోదయ ఏపీ కావాలా?అనే విషయాన్ని ప్రజలే ప్రస్తుత ఎన్నికలలో  నిర్ణయించుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపిచ్చారు. కర్నూల్ లో జరిగిన భారీ బిజెపి ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ రాష్ట్రంలో పుత్రుడి రాజకీయ భవిష్యత్తుకు సూర్యాస్తమయం కావాలని చెప్పారు. 

అభివృద్ధిలో కేంద్రానికి ఏపీ ప్రభుత్వం సహకరించడం లేదని చెబుతూ  ‘‘ఏపీలో కేంద్రం చేపట్టే కొత్త కార్యక్రమాలతో ఇక్కడి యువత బంగారు భవిష్యత్తుపై భద్రత ఏర్పడింది. నేనింకా ఎక్కువ పనులు చేసేందుకు కావాల్సిన ఆలోచనలు నా వద్ద ఉన్నాయి. కానీ, ఇక్కడి ప్రభుత్వం సహకరించట్లేదు" అని మోదీ విమర్శలు గుప్పించారు. 

 కుటుంభం సభ్యులు, బంధువులు, సన్నిహితులకు ఎక్కువగా ప్రస్తుత ఎన్నికలలో సీట్లు ఇవ్వడం గమనిస్తే పరిపాలన ఏ విధంగా సాగుతుందో వేరే చెప్పనక్కర లేదని హెద్దేవా చేశారు. 

ఏపీ అభివృద్ధికి కట్టుబడిన బీజేపేని కేంద్రములో, రాష్ట్రంలో కూడా కోమని సూచిస్తూ ఏపీలో డబుల్‌ ఇంజిన్‌తో పాలన కావాలంటే ఏప్రిల్‌ 11న జరిగే ఎన్నికల్లో బిజెపికి ఓటువేసి గెలిపించాలని ప్రధాని  కోరారు. డబుల్‌ ఇంజిన్‌ అంటే కేంద్ర రాష్ట్రాల్లోబిజెపి ప్రభుత్వం ఉండాలని ఆయన వివరించారు. 

కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు అడగటం ప్రారంభించే సరికి చంద్రబాబు ఎన్డీయే నుండి వైదొలిగారని ధ్వజమెత్తారు.  ఏదైనా పథకం ప్రారంభిస్తే అందులో కుంభకోణం జరిగిందని పూర్వం చెప్పుకొనే వారమని, కానీ ఇప్పుడు పథక రచనే కుంభకోణమయంగా మారుతోందని అంటూ చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో ప్రతి పనీ అవినీతిమయంగా మారుతున్నదని ధ్వమజెత్తారు. 

తన రాజకీయ స్వార్థం కోసం తన అసమర్థతను కప్పి పుచ్చుకొనేందుకు అబద్ధాలు చెబుతున్నారని చంద్రబాబుపై విరుచుకు పడ్డారు. పొలవరం త్వరగా పూర్తి కావాలని కేంద్ర ప్రభుత్వం రూ.7 వేల కోట్లు విడుదల చేసింది. పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల పనులు పూర్తి కాని పరిస్థితి ఉంది. కేంద్రం నుంచి వచ్చే పథకాలకు తమ స్టిక్కర్‌ అతికించుకుని తమవని చెప్పుకుంటున్నారు. అందుకే సీఎం చంద్రబాబు స్టిక్కర్‌ బాబు అయ్యారంటూ ధ్వమజెత్తారు.