ప్రగతి నివేదన సభ అద్భుత విజయం .... కాదు అట్టర్‌ ఫ్లాప్‌

ప్రగతి నివేదన సభ అద్భుత విజయం సాధించిందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతోషం వ్యక్తం చేసారు.  దేశంలో ఎక్కడా జరగని విధంగా సభ జరిగిందని అంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తూ ఉండటం పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేసారు. కాంగ్రెస్‌ నేతలు కళ్లులేని కబోదులని, ప్రభుత్వంపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ప్రగతి నివేదన సభ అద్భుత విజయం సాధించిందని  చెబుతూ తెలంగాణ అభివృద్ధిపై దేశం మొత్తం చర్చించుకుంటోందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలిపారు. కానీ కాంగ్రెస్‌ నేతలు మాత్రం దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజల సంక్షేమం గురించి కేసీఆర్‌ ఆలోచిస్తారని వెల్లడించారు. అందుకే అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలు అనుభవిస్తున్నారని కర్నె స్పష్టం చేశారు.

అయితే ఈ సభ అట్టర్‌ ఫ్లాప్‌ అయిందని ప్రతిపక్షాలు ద్వజం ఎట్టుతున్నాయి. లీకులతో మీడియాలో ఎంతో హైప్‌ సృష్టించారని, తీస్‌మార్‌ ఖాన్‌ అనుకుంటే సీఎం కేసీఆర్‌ ప్రసంగం తుస్సుమనిపించారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి విమర్శించారు. ‘కేసీఆర్‌ హఠావో, తెలంగాణకో బచావో’ అన్న నినాదంతో ఇక ముందకు వెళతామని చెప్పారు. ప్రగతి నివేదన సభ ప్రజల ఆవేదన సభగా జరిగిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ ప్రసంగంలో 2014 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు ప్రస్తావన ఎక్కడుందని ప్రశ్నించారు.

కేసీఆర్‌ ఆవేదన సభగా మిగిలిపోయిందని బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు డా. కే లక్ష్మణ్‌ విమర్శించారు. కొడుక్కి పట్టాభిషేకం చేయాలని కేసీఆర్‌ ఆశపడ్డారని, అయితే జరిగింది మరొకటని ఎద్దేవా చేసారు.  సభకు ప్రజలను తరలించేందుకు రూ. వందల కోట్లు ఖర్చు చేశారని ఆయన ఆరోపించారు. సీఎం మాటల్లో బలం లోపించిందని, దశదిశ లేదని లక్ష్మణ్‌ విమర్శించారు. సీఎం కేసీఆర్‌ ఏం చెబుతారో అని ప్రజలు ఆశగా ఎదురుచూశారని, కానీ ప్రగతి నివేదన సభతో టీఆర్‌ఎస్‌ పరువు బజారుకీడ్చుకున్నారని అవహేళన చేసారు. ముందస్తు ఎన్నికలకు వెళ్తే టీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పదని లక్ష్మణ్‌ స్పష్టం చేసారు.

కేసీఆర్‌ ప్రగతి నివేదన సభ చప్పగా సాగిందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం పెదవి విరిచారు. కేసీఆర్‌ ప్రసంగంలో స్పష్టత లోపించిందని, ఓటమిని ముందే అంగీకరించిన క్రీడాకారుడిలా కేసీఆర్‌ తీరు ఉందని ఆయన విమర్శించారు. ప్రగతి నివేదన సభతో కేసీఆర్‌ పతనం ఆరంభమైందని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు రావని యువతకు ఈ సభతో అర్థమైందని కోదండరాం చెప్పుకొచ్చారు.

టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్వహించిన ప్రగతి నివేదన సభకు కేవలం రెండున్నర లక్షలమందే వచ్చారని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ తెలిపారు. ప్రగతి నివేదన సభ ఫ్లాప్‌ షోగా మిగిలిపోయిందని అంటూ ప్రజలు విహారయాత్రకు వెళ్లినట్టు సభకు వచ్చి వెళ్లారని ఆమె ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను ప్రజలు తిరస్కరిస్తున్నారనడానికి నిన్నటి సభే నిదర్శనమని స్పష్టం చేసారు. తమ సమస్యలపై ఉద్యోగ సంఘాలు కేసీఆర్‌పై గళం విప్పాలని సూచించారు. ముందస్తుకు వెళ్తే ఓడిపోతానని కేసీఆర్‌కు అర్థమైందని డీకే అరుణ పేర్కొన్నారు.