ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ వెంకటేశ్వరావు బదిలీ

హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం శుక్రవారం జీవో నంబర్‌ 750 జారీ చేసింది. ప్రస్తుత ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ ఎటువంటి ఎన్నికల విధులను ఏబీ వెంకటేశ్వరరావుకు అప్పగించవద్దంటూ జీవోలో పేర్కొంటూ.. హెడ్‌ క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. 

కాగా అంతకు ముందు ఏబీ వెంకటేశ్వరరావుముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు పాటించాల్సిందేనంటూ హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో వీరు భేటీ జరిగింది. చంద్రబాబు సర్కార్‌  వెంకటేశ్వరరావును బదిలీ చేయకుండా ఉండేందుకు చివరకు ప్రయత్నాలు సాగించిన విషయం విదితమే. ఓ వైపు ఈసీ స్పష్టమైన ఆదేశాలు, మరోవైపు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కూడా ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేయాల్సిందేనని ఆదేశాలు ఇవ్వడంతో  రాష్ట్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు.