జ్యోతిష్కుడి చేతిలో తెలంగాణ భవిష్యత్ ... మోదీ ఎద్దేవా

తెలంగాణ భవిష్యత్తును నాయకులు నిర్ణయించాలా?జ్యోతిష్యుడు నిర్ణయించాలా? అని ప్రశ్నిస్తూ తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు కోసం బిజెపితో కలిసి నడవండి దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడండి అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపిచ్చారు.  మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌లో జరిగిన బిజెపి భారీ బహిరంగ సభలోమాట్లాడుతూ  కేసీఆర్‌ పార్లమెంటు ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తే సరైన ఫలితం రాదని, నష్టపోవాల్సి వస్తుందని జ్యోతిష్యుడు చెప్పారు. ఎందుకంటే మే నెలలో కేసీఆర్‌ జాతకం బాలేదు. ఆ సమయంలో మోదీ జాతకం అద్భుతంగా ఉంది.అందుకనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని ఎద్దేవా చేశారు.

 ముందస్తు ఎన్నికలకు వెళ్లకుండా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈ సార్వత్రిక ఎన్నికలతో పాటే నిర్వహించి ఉంటే వందల కోట్ల ప్రజా ధనం ఆదా అయ్యేది కదా అని హితవు పలికారు.

‘మీ ఆశీర్వాదం పొందడానికి మళ్లీ వచ్చాను. ఐదేళ్లు రేయింబవళ్లు కష్టపడ్డాను. చౌకీదారుగా 60 నెలలు నా పనితీరును చూశారు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. గతంలో దేశంలో బాంబు పేలుళ్లు జరిగేవి. గత ఐదేళ్లలో పేలుళ్లు జరగకుండా చూశాం. ఉగ్రవాదన్ని కశ్మీర్‌కే పరిమితం చేశాం. దేశ భద్రత, అభివృద్ధే లక్ష్యంగా మా ప్రభుత్వం పని చేస్తోంది' అని పేర్కొన్నారు.

మీవల్లే 5 ఏళ్లు ప్రభుత్వం నడిపాను. పగలు రాత్రి తేడా లేకుండా ప్రజల ఉన్నతి కోసమే శ్రమించాను. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన ఏళ్లతరబడి చూశాం. ఈ చౌకీదార్‌ పాలన 60 నెలలు చూశారు. అనేక అభివృద్ధి పనులు ఈ కాలంలో పూర్తయ్యాయి. అనేక విమర్శలు నేను ఎదుర్కొన్నప్పటికీ దేశానికి ఒక కాపలాదారుగా ఉన్నా. ఎక్కడా వెనుకంజ వేయలేదని తెలిపారు.

కాంగ్రెస్‌ హాయాంలో ఉగ్రవాద, తీవ్రవాద కార్యకలాపాలు చాలానే జరిగాయి. ఇప్పుడు అవన్నీ అరికట్టామా లేదా? అని ప్రశ్నించారు. దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నామని చెబుతూ "మీ ఆశీర్వాదం మాకు ఒక శక్తి. మీరు ప్రధాని కోసం ఓటు వేయకండి. నవ భారతం కోసం ఓటేయండి" అని పిలుపిచ్చారు. భారత దేశ సామర్థ్యం గురించి ప్రపంచం గమనిస్తోంది. రాబోయే ఐదేళ్లలో భారత్‌ కీర్తి ప్రతిష్ఠలు ఇంకా పెరుగుతాయని భరోసా ఇచ్చారు.

గత ఐదేళ్లలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెబుతూ తాము ఒకవైపు సురక్ష, సమృద్ధి, సమానత్వం కోసం పాటుపడుతుండగా, మరోవైపు ప్రతిపక్షానికి సరైన నేత లేరు. నీతి లేదని దుయ్యబట్టారు. సొంత కుటుంబం గురించి ఆలోచించే వారు ఆ పార్టీ వాళ్లు. దళితులను, వెనుకబడ్డవాళ్లను దగా చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ దశాబ్దాలుగా ఎవరి మేలు కోసం పని చేసిందో అందరికీ తెలుసని చెబుతూ ఈ రాష్ట్రంలో  టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ దొందూ దొందే. ఈ రెండు పార్టీలు తమ కుటుంబాల కోసం పని చేసుకుపోతాయని విమర్శించారు.

దేశ వ్యాప్తంగా ఒక స్పష్టత వస్తోందని,  ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరిస్తున్నారని ప్రధాని స్పష్టం చేశారు. భారత వైమానిక దళం పాక్‌ ఉగ్ర శిబిరాలపై చేసిన దాడుల గురించి కాంగ్రెస్‌ అనుమానాలు వ్యక్తం చేస్తోందని మండియపడ్డారు. ఎంత మందిని చంపారో రుజువులతో చూపాలని డిమాండ్‌ చేస్తోందని అంటూ కాంగ్రెస్‌ నిస్సిగ్గుగా ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తోందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు.

గతంలో కేసీఆర్‌ మహబూబ్‌నగర్‌ ఎంపీగా ఉండడం వల్ల కేసీఆర్‌కే మేలు జరిగిందని అయితే,  ఇక్కడి ప్రజలు ఎంపీగా గెలిపిస్తే ఆయన జిల్లాకు ఏమీ చేయలేదని, కేవలం కుటుంబానికి మేలు చేసుకున్నారని ప్రధాని గుర్తు చేశారు. కేసీఆర్‌ మిమ్మల్ని గాలికొదిలేసి పోయింది వాస్తవమా కాదా? ఆయన కుటుంబ ప్రయోజనం కోసం పని చేస్తున్నారా లేదా?  అని ప్రశ్నించారు.

టీఆర్‌ఎస్‌, ఎంఐఎం కూటమి తెలంగాణ ప్రయోజనం కోసం కాదు.. వాళ్ల స్వప్రయోజనాల కోసం, ఓటు బ్యాంకు కాపాడుకోవడం కోసం. మీరంతా ఆలోచించాలి. పాలమూరు ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించిన వారు ఒకవైపు ఉంటే.. పాలమూరు ప్రజల అభివృద్ధి కోసం నేను మరోవైపు ఉన్నాఅని ప్రధాని చెప్పారు. ఏయిమ్స్‌, సైనిక్‌ స్కూల్‌, రైల్వే, జాతీయ రహదారులు వంటి ప్రాజెక్టులు రాష్ట్రానికి ఇచ్చామని చెబుతూ 2014కు ముందు ఇప్పటికీ పోల్చుకోవాలి. మహబూబ్‌నగర్‌ ప్రజల సౌకర్యార్థం రైల్వే లైన్ల కోసం బిజెపి ప్రభుతం పాటుపడుతున్నదని తెలిపారు. 

కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ  టీఆర్‌ఎస్‌ తమమావే అని చెప్పుకొంటోందని ప్రధాని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు పేరు మార్చి కేసీఆర్‌ తమ పథకాలుగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. పేదవారికి కోటి 50 లక్షల మందికి మేం ఇళ్లు కట్టించాం. మాకు మీ ఇళ్లు వద్దంటూ డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు అన్నారు. ఆఖరికి వాటిని కూడా అటకెక్కించారని విమర్శించారు. పేద ప్రజలకు పెద్ద జబ్బులు వస్తే చికిత్స కోసం ఆయుష్మాన్‌ భారత్‌ ప్రవేశపెట్టాం. దీనివల్ల రూ.5 లక్షల వైద్య బీమా సౌకర్యం ఉంటుంది. ఈ పథకాన్ని కేసీఆర్‌ ప్రభుత్వం వద్దంటోంది. పేదలకు సంక్షేమ కార్యక్రమాలు అందించే కార్యక్రమాలు ఈ చౌకీదార్‌ ప్రభుత్వమే ప్రవేశపెడుతోందని స్పష్టం చేశారు

2014కు ముందు దేశంలో కొంత మంది కట్టెల పొయ్యి వాడేవారు. మేం వచ్చాక ఉజ్వల గ్యాస్‌ పథకాన్ని ప్రవేశపెట్టి 7 కోట్ల మందికి కట్టెల పొయ్యి నుంచి విముక్తి కల్పించాం. ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్‌ ఇచ్చాం. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి సామాజిక వివక్షపై రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. అందుకే పేదరికంలో ఉన్నవారికి కుల, మత ప్రాతిపదిక లేకుండా అందరికీ 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఈ చౌకీదార్‌ ప్రభుత్వానిదే అని చెప్పారు.

దేశంలో ఒకవైపు దమ్మున్న కాపలాదారుడు (చౌకీదార్‌) ఉన్నారు. మరోవైపు వంశపారంపర్య రాజకీయాలు, అవినీతి కుంభకోణాలు ఉన్నాయి. ఎటు వెళ్లాలో మీరే తేల్చుకోండని కోరారు. ఏప్రిల్‌ 11న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి భాజపాను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.