మహోన్నత ఎన్టీఆర్ ఆదర్శాలకు నీళ్లొదిలి, మోసపూరిత తెలుగుదేశం పాలనలో ఆంధ్ర ప్రదేశ్ లో అవినీతి, బలహీనమైన పరిపాలనతో అన్ని రంగాలలో తిరోగమనంలో ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలలో శుక్రవారం పర్యటిస్తున్న సందర్భంగా ట్విట్టర్ లో తెలుగు ప్రజలను పలకరించారు.
శుక్రవారం తెలంగాలోని మహబూబ్‌నగర్, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో మోదీ పర్యటించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా మోదీ ఇక్కడి ప్రజలను ఉద్దేశించి తెలుగులో ట్వీట్ చేశారు.
ఈ సాయంత్రం కర్నూలులో ఒక ర్యాలీలో పాల్గొంటానని తెలిపిన మోదీ యువత కలలు నెరవేర్చటానికి తాను ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశీస్సులు కోరుకుంటున్నట్టు తెలిపారు.
మహబూబ్‌నగర్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొనాల్సిందిగా ఆ పరిసరాల ప్రాంతాల్లోని ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. ప్రజల సంక్షేమం కోసం ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తానని పేర్కొన్నారు. దేశ ప్రజలు తిరిగి ఎన్డీయే మిత్ర పక్షాలను తిరిగి మరోసారి ఎందుకు ఎన్నుకోవాలో కూడా వివరంగా చెప్తానని తెలిపారు.
ఆయన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌లో బహిరంగ సభ ముగించుకొని సాయంత్రం 4.15 గంటలకు కర్నూలులోని ఏపీఎస్పీ మైదానానికి చేరుకుంటారు. అక్కడినుంచి ఎస్టీబీసీ కళాశాల మైదానంలో జరిగే సభా ప్రాంగణానికి వెళతారు. సాయంత్రం 4.30 నుంచి 5.15గంటల వరకు ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఏపీఎస్పీ మైదానం నుంచి ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుని విమానంలో దిల్లీకి బయలుదేరివెళ్తారు.
బిజెపికి సెంటిమెంటు ప్రాంతంగా ఉన్న పాలమూరు నుంచి దక్షిణ భారతంలో ఎన్నికల శంఖాన్ని మోదీ పూరిస్తారు. మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రధాని మహబూబ్‌నగర్‌కు చేరుకుంటారు. బిజెపి అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా సభలో ప్రసంగిస్తారు.
మాజీ మంత్రి డీకే అరుణ ఇటీవలే కాంగ్రెస్ నుంచి బిజెపిలో చేరగా అధిష్ఠానం ఆమెకు మహబూబ్‌నగర్ టికెటును కట్టబెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుత టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ జితేందర్‌రెడ్డి సైతం బుధవారం రాత్రి బిజెపి చేరారు. డీకే అరుణ, జితేందర్‌రెడ్డి అనుచరులు పలువురు మోదీ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు.
మహబూబ్‌నగర్ నుంచి భూత్పూరుకు వెళ్లే దారిలో అమిస్తాపూర్ వద్ద సభ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని పర్యటన కావడంతో సభాస్థలికి సమీపంలో మూడు హెలిప్యాడ్లను సిద్ధం చేశారు. ఇప్పటికే మోదీ అంతర్గత భద్రత అధికారులు హెలికాప్టర్‌తో సన్నాహాలు నిర్వహించారు.