ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి భంగపాటు

ఏపీలో జరిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అధికార టీడీపీకి భంగపాటు ఎదురైంది. కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు విజయం సాధించారు.

 పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు 68,120 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్టు ప్రకటించారు. ప్రత్యర్థి నూతలపాటి అంజయ్య 12,550 ఓట్లతో రెండోస్థానంలో నిలిచారు. ఓటమిని ముందే గ్రహించిన టీడీపీ, తాము మద్దతు ఇస్తున్న అభ్యర్థిని బరి నుంచి తప్పించింది. 

ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో మరో పీడీఎఫ్ అభ్యర్థి ఇళ్ల వెంకటేశ్వర్‌రావు (ఐవీ)విజయం సాధించారు. ఐవీ తన సమీప ప్రత్యర్థి శేషారెడ్డిపై 58,255 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఐవీకి 98,193 ఓట్లు రాగా.. ప్రత్యర్థి శేషారెడ్డికి 38,124 ఓట్లు దక్కాయి. 13,852 ఓట్లు చెల్లకుండా పోయాయి. శేషారెడ్డికి టీడీపీ మద్దతు ఇచ్చింది. అయినప్పటికీ ఓడిపోవడం చర్చనీయాంశంగా మారింది. 

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీ మద్దతు ఇచ్చిన శ్రీనివాసులునాయుడు ఓటమిపాలయ్యారు. ఇక్కడ బరిలో నిలిచిన పాకలపాటి రఘువర్మ సమీప ప్రత్యర్థి శ్రీనివాసులనాయుడుపై 8,372 ఓట్ల ఆధిక్యంతో విజేతగా నిలిచారు.