సంక్షోభంలో బీహార్ మహాకూటమి

కొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న బీహార్ రాష్ట్రంలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఏర్పర్చుకున్న మహాకూటమి సంక్షోభంలో పడింది. సీట్ల సర్దుబాటు కూటమిలో చిచ్చుకు కారణంగా నిలిచింది. తమతమ పార్టీల నిర్ణయంపై ఆయా పార్టీల్లోనే నేతలు నిరసన గళం విన్పిస్తున్నారు. ఈ సీట్ల సర్దుబాటు వ్యవహారం న్యాయంగా జరగలేదని, ఇకనైనా మించిపోలేదు.. ఈ విషయంలో తగువిధంగా స్పందించాలని ఆయా పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. 

ఈ వివాదానికి దర్బాంగ్ నియోజకవర్గం కేంద్రంగా మారింది. చాలాకాలం పాటు బీజేపీలో ఉన్న మాజీ క్రికెటర్, రాజకీయ నేత కీర్తి ఆజాద్ ఇటీవలే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరారు. మహాకూటమి అభ్యర్థిగా దర్బాంగ్‌లో కీర్తి ఆజాద్ పోటీలో ఉంటారని పార్టీ నుంచి సంకేతాలు వచ్చాయి. బీహార్ మాజీ ముఖ్యమంత్రి భగవత్ ఝా ఆజాద్ కుమారుడైన కీర్తి ఆజాద్ మైథిలి బ్రాహ్మిణ్ సామాజిక వర్గానికి చెందిన వాడు. 

ఆయనకు కాంగ్రెస్‌లోని సంప్రదాయ వర్గాలతో పాటు బీజేపీకి చెందిన పలువురి మద్దతు ఉంది. దీంతో దర్బాంగను కాంగ్రెస్ ఆజాద్‌కు కేటాయించడం వివాదానికి కారణంగా మారింది. 2014 ఎన్నికల్లో స్వల్ప తేడాతో పరాజయం పొందిన లాల్ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్‌జేడీ పార్టీ ఇక్కడ సీనియర్ నేత అబ్దుల్ బారిని ఇక్కడ రంగంలో దించాలని భావిస్తోంది. ఈ నియోజకవర్గంలో ముస్లింల ఓట్లు అధికంగా ఉన్నందున సీట్ల సర్దుబాటులో దీనిని తమకే కేటాయించాలని ఆ పార్టీ కోరుతోంది. 

కూటమి సీట్ల కేటాయింపులో ఆర్‌జేడీకి 20, కాంగ్రెస్‌కు తొమ్మిది హిందుస్థానీ ఆవామ్ మోర్చా (హెచ్‌ఏఎం)కు మూడు, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్‌ఎల్‌ఎస్‌పీ)కి ఐదు, వికాషీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)కి మూడు, సీపీఐకి ఒక సీటును ఇచ్చారు. కాగా దర్బాంగ సీటుపై తీసుకునే నిర్ణయాన్ని అధిష్టానం పునరాలోచించాలని, పార్టీ చర్య కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసేలా, ధైర్యాన్ని దిగజార్చేలా ఉండరాదని ఆర్‌జేడీ నేత రామ్‌దేవ్‌రాయ్ పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు.

కాగా, రాష్ట్రంలోని సుపాల్ సీటుపై సైతం వివాదం ఏర్పడింది. ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా రంజిత్ రంజన్ ఉండగా, ఆర్‌జేడీ చీఫ్, ఎమ్మెల్యే యదువంశ్ కుమార్ ఇక్కడ తమ పార్టీ తరఫున అభ్యర్థిని పోటీకి పెడతామని, దీనిపై పార్టీ తమపై క్రమశిక్షణా చర్యలకు సైతం భయపడేది లేదని పేర్కొన్నారు. రంజిత్ రంజన్ మాజీ ఎంపీ పప్పు యాదవ్ భార్య. 

ఆయన 2014లో ఆర్‌జేడీ తరఫున పోటీ చేసి మాధేపుర నుంచి ఎంపీగా విజయం సాధించారు. అయితే తదనంతర పరిణామాల్లో ఆయనను లాలూప్రసాద్ యాదవ్ పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో ఆయన సొంతంగా జన్ అధికార పార్టీ (జేఏపీ)ని స్థాపించారు. అప్పటి నుంచి ఆయన తన పార్టీని మహాకూటమిలో చేర్చడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే మాదేపూరలో సోషలిస్టు నేత శరద్ యాదవ్‌ను పోటీకి దింపుతున్నట్టు లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ప్రకటించింది. 

దీంతో రాష్ట్రంలో కన్హయ్యకుమార్, తనలాంటి వారిని చూసి లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ అభద్రతా భావానికి గురవుతున్నారని పప్పు యాదవ్ ఆరోపించారు. ఇప్పటికే కన్హయ్యకుమార్ రాష్ట్రంలోని బెగుసారై నియోజకవర్గం నుంచి మొదటిసారి సీపీఐ తరఫున బీజేపీ నేత గిరిరాజ్ సింగ్‌పై పోటీ చేస్తున్నారు.