జమ్మూకాశ్మీర్‌లో అభివృద్ధిని హరిస్తున్న 35ఏ

రాజ్యాంగంలోని 35ఏ అధికరణ వల్ల జమ్మూ, కాశ్మీర్  రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కుంటుపడుతోందని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. జమ్మూకాశ్మీర్‌లోని శాశ్వతేతర పౌరులు అక్కడ ఎలాంటి ఆస్తులను కొనడానికి వీల్లేకుండా ఈ అధికరణ నిరోధిస్తోందని ఆయన పేర్కొన్నారు. 

రాష్ట్ర అసెంబ్లీకి సాధ్యమైనంత త్వరలో ఎన్నికలు జరపాలని బీజేపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో జైట్లీ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ప్రస్తుతం కాశ్మీర్ రాష్టప్రతి పాలనలో ఉంది. ఈ రాష్ట్రానికి సంబంధించి అన్ని విధానపరమైన నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటోంది. ఏడు దశాబ్దాల కాశ్మీర్ చరిత్రలో తాజాగా మారిన పరిణామాలవల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయని జైట్లీ తన బ్లాగులో పేర్కొన్నారు. 

నాడు నెహ్రూ తీసుకున్న నిర్ణయం చారిత్రక తప్పిదమా లేక దానిని అనుసరించాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించిన జైట్లీ ‘చాలామంది భారతీయులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగానే కాశ్మీర్ విషయంలోనూ కొత్త పంథాలో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు’ అని పేర్కొన్నారు. 1954లో జారీ అయిన రాష్టప్రతి నోటిఫికేషన్‌లో 35ఏ అనే రాజ్యాంగ అధికరణను చేర్చారని ఆయన గుర్తుచేశారు. 

ఆ అధికరణ అంతకుముందు రాజ్యాంగ పరిషత్ రూపంనుంచి రాజ్యాంగ ముసాయిదాలో ఎంతమాత్రం భాగం కాదని జైట్లీ గుర్తుచేశారు. అలాగే రాజ్యాంగంలోని 368 అధికరణ కింద ఓ సవరణ తీర్మానంగా కూడా దీన్ని ప్రవేశపెట్టలేదని, అదే జరిగివుంటే పార్లమెంటు ఉభయ సభల్లో మూడింట రెండొంతుల మెజారిటీ దాన్ని ఆమోదించవలసి ఉండేదని జైట్లీ తెలిపారు. కేవలం రాష్టప్రతి నోటిఫికేషన్‌గానే ఈ అధికరణం తెరపైకి వచ్చిందని పేర్కొన్నారు.

 అలాగే దీనివల్ల శాశ్వత పౌరులకు, అలాగే అశాశ్వత పౌరులకు మధ్య ఎంతో వివక్ష కొనసాగే అవకాశం కూడా ఉంటుందని జైట్లీ గుర్తుచేశారు. కాశ్మీర్‌లో ఉంటున్న లక్షలాదిమంది భారతీయులు లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయగలుగుతారని, రాష్ట్ర అసెంబ్లీ, మున్సిపల్ లేదా పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయలేరని పేర్కొన్నారు. 

అలాగే వీరి పిల్లలకు కూడా కాశ్మీర్ ప్రభు త్వ ఉద్యోగాలు రావని, ఎలాంటి ఆస్తులనూ కొనడానికి వీలు లేదని తెలిపారు. రాష్ట్రానికి చెందినవారు ఇతర రాష్ట్రాలవారిని పెళ్లి చేసుకుంటే వారు వారసత్వ ఆస్తి హక్కులను కోల్పోతారని పేర్కొ న్న ఆయన ఇలాంటి వివక్షలెన్నో ఇతర రాష్ట్రాలకు చెంది కాశ్మీర్‌లో నివసిస్తున్న వారి విషయంలో అమలవుతున్నాయని తెలిపారు.