ఫిరాయింపులతో అసెంబ్లీలో 101కు పెరిగిన టీఆర్‌ఎస్‌ బలం !

అసెంబ్లీ ఎన్నికలలో 88 సీట్లలో అపూర్వమైన విజయం సాధించిన తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రజల మద్దతుతో సుపరిపాలన అందించడం పట్ల దృష్టి సారించకుండా, ఒక్క ఎన్నిక హామీని అమలు జరిపే ప్రయత్నం చేయకుండా, ఇంకా ప్రమాణస్వీకారం కూడా చేయకుండానే ఫిరాయింపుల పట్ల దృష్టి సారించారు. ముందుగా స్వతంత్రులుగా గెలుపొందిన ఇద్దరినీ పార్టీలో చేర్చుకొని బలాన్ని 90కు పెంచుకున్నారు. అదనంగా మిత్రపక్షం ఎంఐఎంకు చెందిన మరో 7 మంది మద్దతు ఎట్లాగూ ఉంది. 

కానీ అంతటితో సంతృప్తి చెందకుండా ప్రతిపక్ష ఎమ్యెల్యేలను చేర్చుకోవడం పట్ల దృష్టి సారించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొడుకు కేటీఆర్ కు కేసీఆర్ అప్పచెప్పిన మొదటి భారీ బాధ్యత ఇదే అనుకుంటా. తాజాగా ఎల్లారెడ్డి ఎమ్యెల్యే జాజుల సురేందర్‌ కాంగ్రెస్  పార్టీకి రాజీనామా చేసి కేటీఆర్ సమక్షంలో కేసీఆర్ కు మద్దతు ప్రకటించారు. దీంతో నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ ప్రాతినిధ్యం కోల్పోనుంది.  

 

టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో సురేందర్‌ పదో వారు. ఇప్పటివరకు కాంగ్రెస్‌ పార్టీ నుంచి తొమ్మిది మంది శాసనసభ్యులు.. రేగాకాంతారావు (పినపాక), ఆత్రం సక్కు(ఆసిఫాబాద్‌), చిరుమర్తి లింగయ్య (నకిరేకల్‌), హరిప్రియ (ఇల్లెందు), కందాల ఉపేందర్‌రెడ్డి (పాలేరు), సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి (ఎల్బీనగర్‌), వనమా వెంకటేశ్వర్‌రావు (కొత్తగూడెం), హర్షవర్ధన్‌రెడ్డి (కొల్లాపూర్‌)  టీఆర్‌ఎస్‌లో చేరారు. టిడిపి నుంచి సండ్ర వెంకటవీరయ్య  చేరబోతున్నారు. 

మొత్తం 119 మంది సభ్యులున్న తెలంగాణ శాసనసభలో టీఆర్‌ఎస్‌ ఖ్యాబలం 90 కాగా.. తాజాగా మద్దతిస్తున్న 11 మందితో ఈ సంఖ్య 101కి చేరనుంది. మరో 7 మంది ఎంఐఎం మద్దతు అధికారపక్షంపై ఎట్లాగూ ఉంది. ఇంకా కాంగ్రెస్ లో 9 మంది ఉండగా, వారిలో మరెంతమంది పార్టీ ఫిరాయిస్తారో చూడవలసి ఉంది. వీరు కాక బిజెపి, టిడిపిలకు చేరొక్కరు ఉన్నారు. 

పార్టీ మారుతున్న వారందరికీ ఒకే మాటగా ఉంది. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నామని చెబుతున్నారు. ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని పేర్కొంటున్నారు. అయితే ఈ విషయం ఎన్నికల ముందు తెలియదా ? ఎన్నికల తర్వాత కేసీఆర్ కొత్తగా చేపట్టిన ఒక్క కార్యక్రమం కూడా లేదే ? 

తమ ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలుస్తామని కూడా ప్రతి వారు చెబుతున్నారు. కానీ ఒక్కరు కూడా రాజీనామా సమర్పించ లేదు. వీరంతా కలసి కాంగ్రెస్, తెలుగు దేశం శాసనసభ పక్షాలను టీఆర్‌ఎస్‌ లో కలుపుతున్నట్లు తీర్మానాలు చేసి, వాటిని స్పీకర్ కు సమర్పించడం ద్వారా పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం పరిధి నుండి తప్పించుకోవాలని చూస్తున్నారు. తిరిగి పోటీ చేసే ధైర్యం వీరిలో ఒక్కరికి కూడా లేదు.