సొంత సీట్లలో సోనియా, రాహుల్ లకు ఎదురు గాలి !

ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, రాయబరేలీలో యుపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీలకు ప్రస్తుతం ప్రతికూల పరిస్థితులు వెన్నంటుతున్నాయి. వారి విజయావకాశాలు రోజురోజుకూ సన్నగిల్లుతున్నట్లు భావిస్తున్నారు. సోనియా గాంధీ ఏదో ఒక విధంగా బయటపడినా రాహుల్ గాంధీ ఓడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నారు. 

బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ పెద్దఎత్తున ఎన్నికల ప్రచారం చేయడం, ఎస్పీ, బీఎస్పీ కూటమి కాంగ్రెస్‌కు వ్యతిరేకం కావడం ఒక కారణమైతే, కాంగ్రెస్ ప్రచారానికి నాయకులు, కార్యకర్తలు కరవైపోవడం ఆ పార్టీ వర్గాలను ఆందోళనకు గురి చేస్తున్నది. అమేథీ, రాయబరేలీ లోక్‌సభ నియోజకవర్గాల్లో రాహుల్, సోనియా తరపున ఎన్నిక ప్రచారం చేసేందుకు స్థానిక నాయకులు ఎవ్వరూ ముందుకు రాకపోవటంతో కాంగ్రెస్ అధినాయకుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

గాంధీ కుటుంబానికి ఎన్నో ఏళ్లనుంచి విజయాలు సాధించిపెడుతున్న అమేథీ, రాయబరేలీ లోక్‌సభ నియోజకవర్గాల పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లుగా ఉండేందుకు కూడా ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఢిల్లీ నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులను అక్కడికి తరలిస్తున్నట్లు పార్టీ వర్గాలే వెల్లడించాయి. 

రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులాం నబీ ఆజాద్, సీనియర్ నాయకుడు అహ్మద్‌పటేల్ తదితర సీనియర్ నాయకులు ఏఐసీసీలో తరచూ సమావేశమై అమేథీ, రాయబరేలీ నియోజకవర్గాల్లో ప్రచార వ్యూహంపై చర్చిస్తున్నారు. ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే అంశంపై మల్లాగుల్లాలు పడుతున్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారం చేసేందుకు ఢిల్లీ నుంచి పంపిస్తున్న కార్యకర్తలను నియమిస్తున్నారు.

యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాయబరేలీ నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతున్నా ఆమె ఇటీవల తన నియోజకవర్గం వైపే వెళ్లలేదు. రాహుల్ గాంధీ ఒకటి, రెండు సార్లు అమేథీ వెళ్లినా అక్కడ ఆయనకు స్థానిక నాయకులు, కార్యకర్తలతోపాటు ప్రజల నుంచి సరైన స్పందన లభించలేదు. కొందరు స్థానికులు ‘రాహుల్ గాంధీ గో బ్యాక్’ అంటూ నినాదాలు ఇవ్వటంతో కాంగ్రెస్ అధినాయకులు నివ్వెరపోవలసి వచ్చింది.

అమేథీలో పరిస్థితి దారుణంగా ఉండడంతో ఉత్తరప్రదేశ్ ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ  ప్రత్యేకంగా ఆ నియోజకవర్గంలో పర్యటించాల్సి వచ్చింది. ఆమె ఒకటి, రెండు రోజుల పాటు అక్కడే ఉండి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తారని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే అమేథీ, రాయబరేలీ నియోజకవర్గాల్లో ఎస్పీ, బీఎస్పీ కూటమి తమ అభ్యర్థిని రంగంలోకి దించితే రాహుల్ గాంధీ ఓటమి ఖాయమనే మాట వినిపిస్తోంది. 

మరోవైపు స్మృతి ఇరానీ అమేథీలోని గ్రామగ్రామానికీ వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఆమె గత నాలుగున్నర సంవత్సరాల నుంచి రాహుల్ గాంధీని ఓడించాలనే ఏకైక లక్ష్యంతో అమేథీలో అలుపెరుగకుండా పని చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు, రాష్ట్ర మంత్రులు అమేథీలో మకాం చేసి ప్రచారం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ కూడా అమేథీ, రాయబరేలీ లోక్‌సభ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 

మరోపక్క అమేథీలో ఓటమి ఎదురయ్యే ప్రమాదం నెలకొన్నందుకే రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వాయనాడ్ లోక్‌సభ నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది శాతం ముస్లిం వర్గం ఓటర్లు, దాదాపు ఇరవై మూడు శాతం క్రైస్తవ ఓటర్లున్నారు. రాహుల్ గాంధీ ఎన్నికల బరిలోకి దిగితే మైనారిటీలకు చెందిన ఈ వర్గాలవారు మూకుమ్మడిగా కాంగ్రెస్‌కు ఓటు వేస్తారని కేరళ నాయకులు చెబుతున్నారు. వాయనాడ్ లోక్‌సభ నియోజకవర్గంలో మొదటి నుంచీ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు.