నోట్ల రద్దుపై కాంగ్రెస్ ఫేక్ వీడియో

నోద్ద నోట్ల రద్దు పేరుతో బీజేపీ నాయకులు అవినీతికి పాల్పడ్డారంటూ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబ్బల్ మీడియా సమావేశంలో విడుదల చేసిన వీడియోను ఫేక్ వీడియో అని కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ధ్వజమెత్తారు. ఈ విషయమై కాంగ్రెస్‌పార్టీపై  చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.  

ఎన్నికల్లో లబ్ధిపొందడానికే ఫేక్ వీడియోను విడుదల చేశారని ఆమె కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. వీడియోకు సంబంధించిన వ్యవహారంపై బీజేపీ న్యాయసలహా తీసుకుంటోందని, కాంగ్రెస్ పార్టీ నేతలతో సహా దీనితో సంబంధం ఉన్న వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. టీఎన్‌ఎన్ వరల్ అనే వెబ్ సైట్ ఆధారిత న్యూస్ చానెల్లో ప్రసారమైన వీడియోను కాంగ్రెస్ నేతలు విడుదల చేశారని ఆమె తెలిపారు.

అంతేకాకుండా సంబంధిత న్యూస్ చానెల్ డైరక్టర్ ఒక రోమన్ వ్యక్తని చెప్పారు. కాంగ్రెస్ కనుసన్నల్లోనే ఆ చానెల్ పనిచేస్తోందని రక్షణ మంత్రి ఆరోపించారు. ఎన్నికల తర్వాత అది తన కార్యకలాపాలను నిలిపివేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. వీడియోను విడుదల చేయడం ద్వారా బీజేపీ ప్రతిష్టను దెబ్బతీయలేరని సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు.

పెద్ద నోట్ల రద్దు తర్వాత.. ఓ బీజేపీ నేత పాత నోట్ల మార్పిడి దందాకు పాల్పడ్డాడని కాంగ్రెస్ ఆరోపించింది. సదరు నాయకుడు 40% కమీషన్ తీసుకుని, పాత నోట్లను మార్చారని ఆరోపించింది. దీనికి సంబంధించి కొందరు జర్నలిస్ట్ లు అహ్మదాబాద్లో చేసిన స్టింగ్ ఆపరేషన్ తాలూకు వీడియోను విడుదల చేసింది.