నిజామాబాద్‌లో బ్యాలెట్‌ ద్వారానే ఎన్నికలు !

ఈ విఎంల పట్ల అపనమ్మకం వ్యక్తం చేస్తూ, తిరిగి బ్యాలట్ ద్వారా ఎన్నికలు జరిపించాలని ప్రతిపక్షాలు కోరడాన్ని ఎన్నికల ప్రధాన కమీషనర్ సునీల్ అరోరా ఎద్దేవా చేస్తున్నా నిజామాబాదు లోక్ సభ నియోజకవర్గంలో మాత్రం బ్యాలట్ ద్వారానే ఎన్నికలు జరుగక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకు ఎన్నికల కమీషన్ తగు సన్నాహాలు కూడా చేబడుతున్నది. 

ఆ నియోజకవర్గంలో అత్యధికంగా 245 నామినేషన్లు దాఖలు కాగా, వారిలో 191 మంది నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయి. పసుపు, ఎర్రజొన్న రైతుల గిట్టుబాటు ధరలు కల్పించలేదని నిరసనగా  భారీగా నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈవీఎంల ద్వారా ఎన్నిక సాధ్యం కాదని అధికారులు గుర్తించారు. బ్యాలెట్‌ ద్వారానే నిర్వహించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో నిజామాబాద్‌ లోక్‌సభ  స్థానంలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ లేఖ రాశారు. 

ఇక్కడ ఎన్నిక కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 28 వరకు గడువు నేపథ్యంలో కసరత్తు ప్రారంభించింది. బ్యాలెట్‌ పత్రాల ముద్రణ, బ్యాలెట్‌ బాక్స్‌ల తయారీకి టెండర్లు ఆహ్వానించింది. సుమారు రెండువేల బ్యాలెట్‌ బాక్స్‌ల తయారీతోపాటు 18 లక్షల వరకు బ్యాలెట్‌ పత్రాలను ముద్రించాల్సి ఉంది.

 ప్రభుత్వ ముద్రణాలయంలో ఇంత పెద్ద సైజులో బ్యాలెట్‌ పత్రాన్ని అచ్చు వేసేందుకు సదుపాయం లేదని అధికారులు గుర్తించారు. ఆయా అంశాలన్నింటినీ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తూ లేఖ రాశారు.   

తెలంగాణలో ఈసీఐఎల్‌ రూపొందించిన ఎం-2 యంత్రాలు అధిక సంఖ్యలో వినియోగంలో ఉన్నాయి. నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్న ఈవీఎంల్లో 70శాతం ఈసీఐఎల్‌ తయారు చేసినవే. 64మంది కన్నా ఎక్కువగా అభ్యర్థులు ఉంటే ఈ ఈవీఎంల ద్వారా పోలింగ్‌ సాధ్యం కాదు. బీఈఎల్‌కు చెందిన ఎం-2 యంత్రాల్లో మాత్రం 386మంది వరకు పోటీలో ఉన్నా వాటిని వినియోగించవచ్చు. 

బీఈఎల్‌ యంత్రాలు రాష్ట్రంలోనే అందుబాటులో ఉన్నప్పటికీ హేతుబద్ధీకరణ ద్వారా అవి వేర్వేరు నియోజకవర్గాలకు వెళ్లాయి. వాటన్నింటినీ సమీకరించటం సాధ్యం కాదని అధికారులు నిర్ధారించుకున్నారు.  

 నిజామాబాద్‌ లోక్‌సభ స్థానంలో నామినేషన్ల పరిశీలన అనంతరం 191 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు తేల్చారు. వీరిలో బిజెపి, కాంగ్రెస్‌, టి ఆర్ ఎస్, పిరమిడ్‌, బహుజన ముక్తి, సమాజ్‌వాదీ ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థులతోపాటు మరో ఇద్దరు స్వతంత్రులు. మిగతా వారంతా రైతులే. నామినేషన్ల గడువులోపు 203 మంది 245 సెట్ల నామపత్రాలు దాఖలు చేశారు. అదనపు సెట్లు పోను 203 మందికి సంబంధించిన నామినేషన్లను అధికారులు అభ్యర్థుల సమక్షంలో మంగళవారం పరిశీలించారు.వివిధ కారణాల వల్ల 12 మంది నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు వివరించారు.