29న బిజెపిలోకి ఎంపీ జితేందర్‌రెడ్డి !

లోక్‌సభలో  టిఆర్‌ఎస్‌  పక్ష నేత, మహబూబ్‌నగర్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి  ఈ నెల 29న ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో బీజేపీలో చేరడానికి రంగం సిద్దమైన్నట్లు తెలుస్తున్నది.  మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానంలో  టిఆర్‌ఎస్‌   టికెట్‌ దక్కకపోవడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఆయనతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ ఫోన్‌లో చర్చలు జరిపారు. పార్టీలో చేరికపై సంప్రదించారు. 29న మహబూబ్‌నగర్‌లో జరిగే ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. 

1999 లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం నుంచి ఆయన బిజెపి  అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత టిడిపిలో, అనంతరం టిఆర్‌ఎస్‌  లో చేరారు. 2014లో మహబూబ్‌నగర్‌ నుంచి టిఆర్‌ఎస్‌   అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు.   

 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, మహేందర్‌రెడ్డిల ఓటమికి జితేందర్ రెడ్డి కారణమన్న ప్రచారం జరిగింది. దీంతో పాటు గతంలో బీజేపీ నుంచి ఎంపీగా గెలిచిన జితేందర్‌రెడ్డికి ఆ పార్టీ జాతీయ నేతలతో మంచి సంబంధాలున్నాయి. పార్టీ ముఖ్యులకు విధేయతగా ఉండడం లేదన్న  ప్రచారం ఉండనే ఉంది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో జితేందర్‌రెడ్డికి టికెట్ ఇవ్వలేదు. 

ఈ సమయంలోనే డీకే అరుణ బీజేపీలో చేరడం, ఆమెకు మహబూబ్ నగర్ టికెట్ ప్రకటించడం జరిగిపోయింది. ఆ తరువాత బీజేపీ జాతీయ నాయకులు చర్చలు జరిపి చేవెళ్ల టికెట్ ఇస్తామంటూ ఆఫర్ చేసినట్టు ప్రచారం జరిగింది. రాజకీయ భవిష్యత్ పై ఆయనకు భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. ముందుగా విముఖత వ్యక్తం చేసిన ఆయన.. తరువాత పార్టీలో చేరడానికి అంగీరించారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.