`ఆవేదన సభ’గా మారిన కెసిఆర్ `ప్రగతి నివేదన’

రాజకీయంగా ఎత్తుగడలు వేసి ప్రత్యర్ధులను చిత్తు చేయడంలో ఆరితేరిన తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు రాబోయే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపడంతో పాటు, జాతీయ స్థాయి రాజకీయాలపై పెంచుకొంటున్న ఆశలకు అదను  పొందే విధంగా చేసేటట్లు ఎంతో ఆర్భాటంగా జరిపిన `ప్రగతి నివేదన’ బహిరంగ సభ ప్రతిపక్షాలు ముందు నుండి విమర్శిస్తున్న విధంగా `ఆవేదన సభ’గా జరిగింది. అసెంబ్లీ రద్దు గురించి, ముందస్తు ఎన్నికల గురించి కీలకమైన రాజకీయ ప్రకటనలు ఈ సభలో చేస్తారని ఎదురు చుసిన వారికి నిరాశే ఎడురైనది.

పైగా వచ్చే ఎన్నికలలో ప్రజలపై ప్రభావం చూపగల కొత్త పధకాలు, కార్యక్రమాలకు సబంధించి భారీ ప్రకటనలు చేస్తారని జరిగిన ఉహాగానాలు వట్టివని తేలిపోయాయి. భారత దేశ రాజకీయ చరిత్రలో జరుగనంతటి భారీ బహిరంగ సభ జరుపుతున్నట్లు భారీ ప్రచారం కల్పించడంతో మొత్తం దేశం దృష్టిని ఆకట్టుకొన్న టీఆర్‌ఎస్ `ప్రగతి నివేదన’ బహిరంగ సభ చాల నిస్సారంగా సాగింది. ఎన్నికల సంవత్సరంలో ప్రజలకు స్పష్టమైన రాజకీయ సందేశం అంటూ ఏమీ ఇవ్వకుండా ఇంతటి భారీ కసరత్తు ఎందుకు చేసారా అని రాజకీయ వర్గాలు విస్తు పోతున్నాయి.

పొలిటికల్ పంచ్‌లతో, ప్రత్యర్ధులపై చురకలు అంటిస్తూ, వ్యంగ భాషణలతో సభికులను ఉత్తేజ పరుస్తూ ఉండే ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు చేసిన ప్రసంగం ఆ పార్టీ శ్రేణులకే నీరసం కలిగించింది. తన సహజ ధోరణిలో వినిపించే పిట్ట కధలను సహితం ఈ పర్యాయం కెసిఆర్ ప్రస్తావించక పోవడం గమనార్హం. మాటవరుసకు కాంగ్రెస్ పార్టీపై కొన్ని ఘాటైన విమర్శలు కురిపించినా వాటిల్లో సహితం తగు వాడి, వేడి తనం లేకపోవడం స్పష్టంగా కనిపించింది. అసలు మాట్లాడుతున్నది కెసిఆర్ యేనా అనే అనుమానాలు కుడా కలుగక మానలేదు.

వారం రోజులపాటు రాష్త్రం అంతటా పెద్ద ఎత్తున ప్రచారం సాగించి, మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని మొహరించి, భారీగా వనరులను సమీకరించి, మొదటిసారిగా ఔటర్ రింగ్ రోడ్ ను మరెవ్వరు ఉపయోగించకుండా కట్టడి చేసి, బహిరంగ సభ కోసం పలుచోట్ల కూల్చివేతలతో అప్రోచ్ రోడ్ లను వేసుకున్నారు. అయితే  ప్రభుత్వ అధినేత ప్రసంగంలో అటువంటి ఉత్సాహం, ముందస్తు ఎన్నికలకు పోబోతున్నమన్న పట్టుదల, తిరిగి గెలుపొండుతున్నామన్న భరోసా ఎక్కడ కనిపించనే లేదు.

ఈ బహిరంగ సభలో కీలకమైన రాజకీయ ప్రకటనలు చేయబోతున్నరనే కధనాలు వ్యాప్తి చెందడంతో ప్రజలు అంతా ఆసక్తితో ఎదురు చూసారు. తీరా త్వరలో `రాజకీయ ప్రకటన’ చేయబోతున్నట్లు చెప్పడం ద్వారా ముందస్తుకు వెళ్ళబోతున్నట్లు సంకేతం ఇవ్వడం మినహా ఈ విషయమై నిర్దుష్టంగా ఎటువంటి ప్రకటన చేయక పోవడంతో పార్టీ శ్రేణులతో పాటు వేదికపై ఉన్న మంత్రులు, ఇతర నాయకులు సహితం నివ్వెర పోయారు.

అయితే ముందస్తుపై వస్తున్న కధనాలను మాత్రం త్రోసిపుచ్చలేదు. ఆయనే స్వయంగా కొద్ది రోజులుగా ఈ సభలో తాను అసెంబ్లీ రద్దు గురించి, ముందస్తు ఎన్నికల గురించి ప్రకటన చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయని ప్రస్తావించారు. ఈ విషయమై తెలంగాణా రాష్ట్రం, పార్టీ, ప్రజల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని తగు నిర్ణయం తీసుకొనే అధికారాన్ని మంత్రివర్గం, పార్టీకి చెందిన ఎమ్యెల్యేలు, ఎమ్యేల్సిలు, ఎంపిలు తనకు అధికారాన్ని కట్టబెట్టిన్నట్లు కూడా చెప్పారు. త్వరలోనే అందుకు సంబంధించి ప్రకటన చేస్తాను అని మాత్రం హామీ ఇచ్చారు.

ముఖ్యంగా యువతకు ఉద్యోగ కల్పన గురించి, నిరుద్యోగ బృతి చెల్లింపు గురించి కీలకమైన ప్రకటన చేస్తారని ఎదురు చుసిన వారికి నిరాస ఎడురైనది. కనీసం లక్ష ఉద్యోగాలకు తాజాగా ఎంపిక జరుగుతుందని ఈ సభలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఉహాగానాలు వెలువడ్డాయి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తిరిగి తామే గెలుస్తామని, వందకు తగ్గకుండా సీట్లు వస్తాయని ప్రతి సభలో చెబుతూ  జోష్ నింపే ప్రయత్నం చేసే కేసీఆర్ లో ఇప్పుడు అటువంటి ప్రస్తావనే చేయక పోవడం గమనార్హం. తాను చేబడుతున్న అభివృద్ధి పధకాల కొనసాగింపుకు మరోసారి అధికారం కట్టబెట్టామని మాత్రం కోరారు.

ఎన్నో ఆశలు, అంచనాలతో మొదలైన సభలో నిస్సారం ఆవహించటానికి కారణమేంటనే ప్రశ్నలతో అధికార పార్టీ నేతలు ఇప్పుడు తర్జనబర్జనలకు గురవుతున్నారు. బహిరంగ సభకు 25 లక్షల మంది జనాన్ని సమీకరిస్తామని చెప్పుకొంటూ వచ్చిన అధికార పార్టీ నేతలు అందులో పదోవంతు సమీకరించే సరికి చతికల బద్దారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. వేదిక మీదకు రాగానే వచ్చిన జనాన్ని చుసిన కెసిఆర్ స్వయంగా అంచనాలు తలకిందులైన్నట్లు షాక్ కు గురయ్యారా అనే అనుమానాలు ఈ సందర్భంగా కలుగుతున్నాయి.

సాధారణంగా గంట నుండి గంటన్నర సేపు సుదీర్ఘంగా కెసిఆర్ ప్రసంగం ఉంటుందనే సంకేతం ఇచ్చారు. కాని పట్టుమని 40 నిముషాలకే ప్రసంగం ముగించారు. గత సంవత్సరం వరంగల్ లో పార్టీ వార్షికోత్సవ బహిరంగ సభలో సహితం 40 నిముషాలకే ప్రసంగం ముగించడం గమనార్హం.  ప్రసంగం ముగించగానే వందన సమర్పణ వరకు కుడా వేచిఉండకుండా హడావుడిగా వెళ్ళిపోయారు. గతంలో ఎప్పుడు ఆ విధంగా చేయనే లేదు.

బహిరంగ సభకు ముందే అత్యవసరంగా మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసారు. దానితో ప్రజల అంచనాలు మరింతగా పెరిగాయి. మంత్రివర్గంలో కీలక నిర్ణయాలు తీసుకొని, బహిరంగ సభలో  ప్రకటించడం కోసమో, అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకొని, రాజభవన్ కు వెళ్లి గవర్నర్ కు తెలిపి, అక్కడ నుండి బహిరంగ సభకు రావడానికే ప్రణాళిక వేసుకున్నారని చలామంది భావించారు. అయితే సాధారణ అంశాలు మినహా మంత్రివర్గంలో తీసుకున్న కీలక నిర్ణయాలు గాని, అత్యవసరంగా చర్చించిన అంశాలు గాని కనిపించక పోవడం గమనార్హం. దానితో అసలెందుకు ఆ సమయంలో మంత్రివర్గ సమావేశం జరిపారో ఎవ్వరికీ అర్ధం కావడం లేదు.

ముఖ్యమంత్రి ప్రసంగంలో నాలుగేళ్ల తన పాలనలో సాధించిన విజయాలు, చేయబోతున్న కార్యక్రమాల గురించి కన్నా అధికారంలోకి రాక ముందు జరిగిన పరిణామాలను జపించడంలోనే ఎక్కువ సేపు గడిపారు. ప్రజలలో ఉద్యమ స్పూర్తి ఒక వంక, మరోవంక ఆత్మగౌరవం నినాదంతో తిరిగి ఎన్నికలలో గెలుపొందే ప్రయత్నంలో ఉన్నారని, ప్రభుత్వ పనితీరుపై ప్రజల తీర్పు కోరే సాహసం చేయలేక పోతున్నారని ఈ సందర్భంగా సంకేతం ఇచ్చిన్నట్లు  పలువురు భావిస్తున్నారు.

ఇక్కడ బహిరంగ సభ జరుతున్న సమయంలోనే నిరుద్యోగ యువత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక సభ జరిపే ప్రయత్నం చేయడం, దానిని పోలీస్ లు భగ్నం చేయడం ఈ సందర్భంగా గమనార్హం. ‘తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ ఆవేదన సభ’లో కొత్తగా ఉద్యోగాలు సృష్టించక పోయినా ఖాళీగా ఉన్న సుమారు మూడు లక్షల ఉద్యోగాలను ముందు భర్తీ చేయమని కోరారు. అయితే ఎవ్వరు ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించినా తట్టుకోలేని అసహనానికి కెసిఆర్ గురవుతున్నారా అనే ప్రశ్నలు ఈ సందర్భంగా తలెత్తుతున్నాయి.

వివిధ ప్రభుత్వ పధకాల ద్వారా లబ్ది చేకూరుస్తామనే అపోహలు కలిగించి గిరిజనులు, ఇతర బడుగు వర్గాలకు చెందిన ప్రజలను బహిరంగ సభకు తరలించినా వారెవ్వరూ ఉత్సాహంగా పాల్గొన్నట్లు లేదు. ఎన్నికల సమయంలో కెసిఆర్ చేసిన పలు హామీలు అమలు జరిపే ప్రయత్నం చేయక పోవడం అధికార పక్షానికి క్షేత్ర స్థాయిలో ఇబ్బందికరంగా మారింది.

2014 ఎన్నికల సమయంలో పేదలు అందరికి రెండు పడకల గృహాలు నిర్మిస్తామని, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్,  గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్,  ఇంటికో  ఉద్యోగం కలిపిస్తామంటూ ఎన్నెన్నో హామీలు చేసారు. కాని అటువంటి హామీల గురించి కనీసం ప్రస్తావించే సాహసం కుడా కెసిఆర్ ఇప్పుడు చేయడం లేదు. రెండు పడకల గృహాల గురించి ఆయన ప్రసంగంలో కనీసం ప్రస్తావన లేకపోవడం గమనార్హం.

ఒక వంక రైతులు ఆత్మహత్యలు, మరోవంక మిగులు రాస్త్రాన్ని అప్పులలో ముంచెత్తడం ద్వారా పరిపాలనపై కెసిఆర్ కు అసలు అదుపు ఉన్నదా అనే అనుమానాలు కలిగిస్తున్నాయి. కానీ దేశంలో నెంబర్ 1 గా తెలంగాణాను అభివృద్ధి చేసామని ప్రగల్భాలు మాత్రం పలుకుతున్నారు. నాలుగేళ్ల పాలనలో తమ ప్రభుత్వం చేసిన కార్యక్రమాల గురించి ఈ సభలో ప్రజలకు నివేదిక ఇవ్వడం కోసం `ప్రగతి నివేదన’ అని పేరు పెట్టారు. అయితే ఆ వివరాలను కరపత్రంలో వివరించమని చెప్పారు. కరపత్రాలను పంచడం కోసం ఇంతటి భారీ బహిరంగ సభ జరపవలసిన అవసరం ఉందా ?

ముందస్తు ఎన్నికల గురించి పార్టీ అంతా సమాయత్తమవుతుండగా, కేసీఆర్ మాత్రం ఎన్నికల వేడి రగిలించే ప్రయత్నం ఇక్కడ చేయక పోవడం పలువురికి విస్మయం కలిగిస్తున్నది. ముందస్తు ఎన్నికలకు తమకు అభ్యంతరం లేదని ప్రధాని మోడీ భరోసా ఇచ్చినప్పటికీ ఎన్నికల కమీషన్ నుండి స్పష్టమైన సంకేతాలు లభించక పోవడం కెసిఆర్ నిర్వేదానికి కారణమా అనే అనుమానాలు ఎదురవుతున్నాయి.