మార్పు కోసం నుంచి పల్లె పల్లెకూ బీజేపీ

తెలంగాణాలో రాజకీయ మార్పు కోసం బీజేపీ ఈ నెల 17 నుంచి 26 వరకూ ‘మాట తప్పిన సర్కారు మార్పు కోసం బీజేపీ’ నినాదంతో పల్లె పల్లెకు బీజేపీ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు. 17 నుంచి ప్రారంభించే పల్లె పల్లెకు బీజేపీ 26 వరకూ నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించుకున్నట్లు రాష్త్ర బిజెపి అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దాదాపు 12 వేల గ్రామాల్లో బిజెపి నాయకులు, కార్యకర్తలు పర్యటించనున్నారు. పర్యటనల్లో భాగంగా ప్రతి గ్రామానికి 11 మంది బీజేపీ నేతలు మోటారు బైక్‌లతో వెళ్తారు. వీరిలో ఒకరు రాష్ట్రస్థాయి నాయకుడు కచ్చితంగా ఉంటారు. గ్రామాలకు వెళ్లే నేతలు రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం ద్వారా ఆయా గ్రామాల్లోని సమస్యలను అడిగి తెలుసుకుంటారు. దీంతో పాటు ఆ గ్రామాల్లోని దళితవాడల్లో ప్రత్యేకంగా రచ్చబండ నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు వివరిస్తారు. దళిత ముఖ్యమంత్రి నుంచి మూడెకరాలు పంపిణీ, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, ఉద్యోగాల కల్పన తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను, చేసిన వాగ్దానాలను ప్రస్తావిస్తూ అమలులో జరుగుతున్న జాప్యం, సర్కారు నిర్లక్ష్యన్ని వివరిస్తారు. అనంతరం అక్కడి దళిత వాడలోని ఒక్కో ఇంట్లో ఒక్కోనేత భోజనం చేస్తారు. ఆ వాడలోనే నిద్రిస్తారు. ఆయా గ్రామాలు, నియోజకవర్గాల్లోని సమస్యలను క్రోడీకరించుకొని ఎన్నికల ప్రణాళిక రూపొందించుకుంటామని పార్టీ నేతలు చెబుతున్నారు.