ఏపీకి ప్రత్యేక హోదాకన్నా ప్రత్యేక ప్యాకేజి ముఖం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో కేంద్రానికి వ్రాసిన లేఖలను కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ విజయవాడలో విడుదల చేయడం ద్వారా టిడిపి నేత బండారాన్ని బైట పెట్టారు. ఆంధ్ర ప్రదేశ్ బీజేపీకి ఎన్నికల ప్రచారాన్ని విడుదల చేస్తూ ప్రత్యేక హోదాపై చంద్రబాబు నాయుడు ఏ విధంగా యూటర్న్ తీసుకున్నారో వెల్లడి చేశారు.
హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీనే ముఖ్యమని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి 2016 అక్టోబర్ 24న చంద్రబాబు రాసిన పలు లేఖలను ఆయన విడుదల చేశారు. ప్యాకేజీ ద్వారా ఏపీకి ఎలా సహాయం చేయాలన్న విధానం గురించి కూడా చంద్రబాబు లేఖలో పేర్కొన్నట్లు ఆయన వెల్లడించారు. 2017 టీడీపీ మహానాడులో హోదా వద్దని ప్యాకేజీ కావాలంటూ చేసిన తీర్మానాన్ని ఆయన గుర్తుచేశారు.
ప్యాకేజీని స్వాగతిస్తూ 2017 మార్చి 16న ఏపీ అసెంబ్లీ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన అంశాన్ని గోయల్ ప్రస్తావించారు. ఇన్ని కుట్రలు చేసిన చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనం కోసం కేంద్రంపై ఆరోపణలను చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీపై ఉన్న ప్రజా వ్యతిరేకతను తమపై నెట్టడానికే కేంద్రం నుంచి బయటకు వచ్చారని వెల్లడించారు.
హోదా ద్వారా రాష్ట్రానికి ఏడాదికి రూ. 3,500 కోట్లు వస్తాయని, అంతే మొత్తంలో ప్యాకేజీ రూపంలో కేంద్రం ఇచ్చిందని పేర్కొన్నారు. ఏపీ అర్థిక లోటును భర్తీ చేయడానికి గ్రాంటుగా రూ 22,113 కోట్లు 14వ ఆర్థిక సంఘం ద్వారా అందిస్తున్నమని తెలిపారు. కేంద్రంపై రాష్ట్రంలో దుష్పచారం జరుగుతోందని ధ్వజమెత్తుతూ అపోహలు నివృత్తి చేసేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు.
దుర్గమ్మ దీవెనలతో రాష్ట్ర అభివృద్దికి మోడి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. త్రిపుర ఎన్నికలలో ఏ విధంగా బీజేపీ విజయం సాధించిందో అదే పరిస్థితి ఏపీలో రిపీట్ కానుందని ధీమా వ్యక్తం చేశారు.
టీడీపీ, కాంగ్రెస్ జట్టుకడితే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రుజుమైందని గోయల్ ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించి.. ఆయనను అవమానించిన కాంగ్రెస్‌తో జట్టు కట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబు ప్రభుత్వాన్ని ఓడించడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని భరోసా వ్యక్తం చేశారు.
తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బాబు
ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం రెండు తెలుగు రాష్ట్రల మధ్య చంద్రబాబు నాయుడు చిచ్చులు పెడుతున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కి హైదరాబాద్‌లో ఆస్తులు లేవా అని ప్రశ్నించారు. పక్కవారిని తిట్టడానికే ఆయన అనుభవం ఉపయోగపడుతోందని మండిపడ్డారు. మచిలీపట్నం పోర్టును కేసీఆర్ తెలంగాణకు తరలించుకుపోతారని మంత్రి లోకేష్ కనీస అవగహన లేకుండా మట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
ఏప్రిల్ 11 న జరిగే ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని గోయల్ చెప్పారు. కేంద్ర పథకాలకు రాష్ట్రంలో స్టిక్కర్లు వేసుకొని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. పుల్వామా దాడిని రాజకీయం చేసి దేశాన్ని తాకట్టు పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోందని, మమతా బెనర్జీ, చంద్రబాబు మాటలు పాకిస్ధాన్ పార్లమెంట్ లో ప్రస్తావించబడతాయని మండిపడ్డారు. ఏప్రిల్ 11న జరిగే ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు చరమగీతం పాడి ఇంటికి పంపడం ఖాయమని తెలిపారు.