బిజెపి కూటమికి 300కు పైగా సీట్లు

ఈ సారి ఎన్నికల్లో బిజెపి దాని మిత్రపక్షాలు 300కు పైగా స్థానాలను గెలుచుకుంటాయని ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ భరోసా వ్యక్తం చేశారు. సోమవారం నాగ్‌పూర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బిజెపి  అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం మాట్లాడుతూ బిజెపి సొంతంగా 270 సీట్లు గెల్చుకొంటుందని ధీమా వ్యక్తం చేశారు. 

‘‘ఈ ఎన్నికల్లో  బిజెపి   కనీసం 270 స్థానాలు గెలుచుకుంటుంది. మహారాష్ట్రలో  బిజెపి  -సేన కూటమి 40 సీట్లలో విజయం సాధిస్తుంది’’ అని గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఈసారి కూడా భారీ మెజార్టీతో తాను విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. నాగ్‌పూర్ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల మద్దతు తనకు ఉందని చెప్పారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విలాస్ ముత్తెంవర్‌పై గడ్కరీ 2.84 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 

ప్రధానమంత్రి పదవి రేసులో తాను లేనని గడ్కరీ మరోసారి స్పష్టం చేశారు. ఇవన్నీ వదంతులేనని.. ఇప్పటివరకు తన రాజకీయ జీవితంలో ప్రధాని కావాలనుకుంటున్నాని ఎక్కడా వ్యాఖ్యానించలేదని తెలిపారు. ప్రస్తుతం తాను ఉన్న స్థానంలో సంతోషంగా ఉన్నానని పేర్కొన్నారు. పార్టీ ఎటువంటి బాధ్యతను అప్పగించినా.. సమర్థంగా నిర్వర్తించడమే తన కర్తవ్యమని చెప్పుకొచ్చారు. 

బిజెపి 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల కంటే ఎక్కువ పథకాలు ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. అలాగే ఎంపీగా, మంత్రిగా తాను సాధించిన విజయాలను గుర్తుచేశారు. ఐదేళ్ల మోదీ సర్కారుపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని గడ్కరీ భరోసా వ్యక్తం చేయారు. నామినేషన్ దాఖలు చేసిన సమయంలో ఆయన వెంట మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కూడా ఉన్నారు. నాగ్‌పూర్ లోక్‌సభ నియోజవర్గానికి మొదటి విడతలో ఏప్రిల్ 11న ఎన్నికలు జరగనున్నాయి.