బీజేపీలో చేరిన నటి జయప్రద

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద భారతీయ జనతా పార్టీలో చేరారు. దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ ఆమెకు బిజెపి కండువా కప్పి పార్టీలోకోయ్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా జయప్రద మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నేతృత్వంలో పనిచేసే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆమెను యూపీలోని రామ్‌పూర్‌ నుంచి బీజేపీ బరిలోకి దింపే అవకాశాలు కన్పిస్తున్నాయి.

రామ్‌పూర్‌ నుంచి జయప్రద గతంలో రెండు సార్లు సమాజావాది పార్టీ అభ్యర్థిగా ఎంపీగా గెలుపొందారు. దీంతో ఆమెను రామ్‌పూర్‌ బరిలో దింపితే గెలుపు ఖాయమని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో ఆమె సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ఆజంఖాన్‌తో తలపడనున్నారు.

1994లో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేసిన జయప్రద రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. టిడిపి ఎన్నికల ప్రచారంలో కూడా క్రియాశీలకంగా పాల్గొనేవారు. ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీలోకి మారారు. 

2004 లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై రామ్‌పూర్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2009 ఎన్నికల్లోనూ మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే ఆ తర్వాత పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ జయప్రదను 2010లో సమాజ్‌వాదీ పార్టీ బహిష్కరించింది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆర్‌ఎల్‌డీ పార్టీ తరఫున బిజ్‌నోర్‌ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 

సమాజ్‌వాదీ పార్టీలో ఉండగా  ఆజంఖాన్‌తో పాడెడిది కాదు. తాను ఆ పార్టీ నుండి బైటకు రావడానికి అతనే కారకుడిగా చెబుతూ ఉండేవారు. పైగా తనపై యాసిడ్ దాడికి ప్రయత్నం చేశారని కూడా ఆరోపించారు.