టిటిడిని వెంటాడుతున్న రాయలు ఇచ్చిన నగలు

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి 16వ శతాబ్దిలో శ్రీకృష్ణ దేవరాయలు స మర్పించిన ఆభరణాలు ఎక్కడున్నాయనే ప్రశ్నలు ఒకవంక ప్రపంచంలోనే ప్రముఖమైన ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)ని, మరో వంక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఈ విషయమై టిటిడి, ప్రభుత్వం ఇస్తున్న పొంతనలేని సమాధానాలు ఎవ్వరిని సంతృప్తి పరచలేక పోతున్నాయి.

తాజాగా, కేంద్ర సమాచా ర కమిషన్(సీఐసీ) ఈ విషయమై ప్రశ్నలు లేవనెత్తింది.  సమాధానం ఇవ్వాలని భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ), ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, టిటిడిలను ఆదేశించింది. తిరుమలలోని దేవాలయాలను జాతీయ స్మారక చిహ్నాలుగా ప్రకటించడం, కొండపై ఉన్న ప్రపంచ వారసత్వ కట్టడాలు, పురాతన ఆభరణాల పరిరక్షణకు తీసుకున్న చర్యలను తెలుపాలని ప్రధానమంత్రి కార్యాలయాన్ని (పీఎంవో) కుడా కోరింది.

టీటీడీని వారసత్వ కట్టడాల జాబితాలోకి చేర్చడంపై పీఎంవో తీసుకున్న చర్యలను తెలుపాలని బీకేఎస్‌ఆర్ అయ్యంగార్ అనే వ్యక్తి సీఐసీని ఆశ్రయించారు. దీనిపై గతంలో వివిధ శాఖలను కోరితే వారు అసంపూర్తిగా సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ విచారణ జరిపారు.

తిరుమలలోని 1500 ఏండ్ల పురాతన కట్టడాలను 2011లో వారసత్వ జాబితాలో చేర్చారని, వాటి నిర్వహణలో టీటీడీ విఫలమైందని తన దరఖాస్తులు అయ్యంగార్ విమర్శించారు. స్వామివారికి శ్రీకృష్ణదేవరాయలు బహూకరించిన ఆభరణాల వివరాలను టీటీడీ బహిర్గతం చేయలేదని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లోని పురావస్తు, మ్యూజియంలశాఖ డైరెక్టర్ 2011లో 20 మంది సభ్యులతో కూడిన ఓ కమిటీని వేసి విచారించగా, తిరుమల ఆలయ గోడలపై రాయలు ఇచ్చిన ఆభరణాల వివరాలు చెక్కి ఉన్నాయని గుర్తించిందని, ప్రస్తుతం దేవాలయంలో ఆ ఆభరణాలు లేవని తేల్చిందని చెప్పారు.

పైగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డీపీ వాధ్వ, జస్టిస్ జనార్ధన్‌రావుతో టీటీడీ వేసిన కమిటీ సహితం ఆలయంలోని ఆభరణాలపై టీటీడీ బోర్డు 1952 నుంచి నిర్వహిస్తున్న తిరువాభరణం రిజిస్టర్‌లో రాయల నగల వివరాలు లేవని తేల్చి చెప్పిందని గుర్తు చేసారు.

1952కు ముందు సమర్పించిన నగల వివరాలు లేవని పేర్కొన్నారు. స్వయంగా రాయల నగల పరిశీలనకు కమిటీ సిద్ధమైనా, అర్చకులు అడ్డుకున్నారని తెలిపారు. ఆ కమిటీ సూచనలను టీటీడీ విస్మరించిందని విమర్శించారు. అంతేకాక 15వ శతాబ్ధిలో సాలువ మల్లదేవర మహరాజు నిర్మించిన వెయ్యికాళ్ల మండపాన్ని టీటీడీ 2003లో అకారణంగా కూలగొట్టిందని తప్పు పట్టారు.మిగతా పురాతన కట్టడాలకు ముప్పు ఉన్నదని ఆందోళన వ్యక్తం చేస్తూ టీటీడీని వారసత్వ జాబితాలో చేర్చితే రక్షణ కలుగుతుందని కోరారు.