బిజెపిలోకి పారాలింపియన్‌ దీపా మాలిక్‌

ప్రముఖ పారా అథ్లెట్‌, పారాలింపిక్‌ పతక విజేత దీపా మాలిక్ భారతీయ జనతా పార్టీలో చేరారు. హరియాణాలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుభాష్‌ బరాలా, పార్టీ జనరల్‌ సెక్రటరీ అనిల్‌ జైన్‌ సమక్షంలో దీప పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా అనిల్‌ జైన్‌ మాట్లాడుతూ.. దీప బీజేపీలో చేరడంతో హరియాణాలో పార్టీ మరింత బలపడినట్లయిందని హర్షం వ్యక్తం చేశారు.

‘దీపా మాలిక్‌ను సాదరంగా స్వాగతిస్తున్నాం. ఆమె మనందరికీ ఆదర్శప్రాయం. తన ఆటతో దేశం గర్వపడేలా చేశారు’ అని అనిల్‌ జైన్ ప్రశంసించారు. అనంతరం దీప మాట్లాడుతూ.. మహిళా సాధికారత కోసం ప్రధాని మోదీ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మోదీ ప్రభుత్వం మహిళలకు ఎన్నో కీలక బాధ్యతలు అప్పగించారని, దివ్యాంగుల కోసం కూడా ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు. 

హరియాణాలో మే 12న లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ ఇంకా ఖరారు చేయలేదు. వచ్చే ఎన్నికల్లో కొత్త అభ్యర్థులకు ప్రాధాన్యమిస్తున్న కమలం పార్టీ.. దీపకు లోక్‌సభ టికెట్‌ ఇచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. 2016లో జరిగిన సమ్మర్‌ పారాలింపిక్స్‌లో షాట్‌పుట్‌ విభాగంలో దీప రజత పతకం సాధించారు. పారాలింపిక్స్‌లో పతకం గెలిచిన తొలి మహిళ ఈమే.