ఉగ్రమూకల ఫైనాన్సర్లపై ఉక్కుపాదం

పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ తరఫున పనిచేస్తూ కాశ్మీర్‌లోని ఉగ్రవాదులు, రాళ్ల మూకలకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్న 13మంది ఫైనాన్సర్లను భద్రతాదళాలు గుర్తించాయి. వీరిపై ఉక్కుపాదం మోపడం ప్రారంభించాయి. ఆర్థిక సహాయం అందజేస్తున్న వారిలో హిజ్‌బుల్ ముజాహిద్దీన్ వ్యవస్థాపకుడు సయ్యద్ సలావుద్దీన్, హురియత్ లీడర్లు, కొందరు వ్యాపారులు ఉన్నారు.

ఈ 13మందికి చెందిన ఆస్తులను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకునే ప్రక్రియను జాతీయ పరిశోధనా సంస్థ (ఎన్‌ఐఏ) ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. ఈ ఫైనాన్సర్లు లష్కర్ ఏ తోయిబా, హిజ్‌బుల్ ముజాహిదీన్, హురియత్ లాంటి ఉగ్ర సంస్థలతో పాటు పలువురు వేర్పాటువాదులకు, రాళ్లు విసిరే ముఠాలకు జమ్మూకాశ్మీర్‌లో నగదు సహాయాన్ని అందచేస్తున్నారు. 

అంతేకాకుండా స్థానిక యువతను ఉగ్రవాద సంస్థల్లో చేర్చుకుంటూ, వారు సాయుధ దళాలపై దాడులకు దిగేలా, ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించేలా ప్రోత్సహిస్తున్నారు. అంతేకాకుండా వీరికి శిక్షణ కూడా ఇస్తున్నారు. పెద్దమొత్తంలో నగదును హురియత్‌కు చెందిన బడా నేతలకు అందజేస్తుండటంతో వారు ఎప్పటికప్పుడు కాశ్మీర్‌లో అస్థిర పరిస్థితులను నెలకొల్పడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

 ఈ నేపథ్యంలో వారు వార్తాపత్రికలు, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా దుష్ప్రచారానికి దిగుతూ భయాందోళనలు సృష్టిస్తున్నారు. ఈ నిధులను ఇటీవల నిషేధించిన జమాత్- ఎ -ఇస్లామీ, జేకే లాంటి సంస్థలకు చెందిన మసీదులు, మదరసాల ద్వారా వీరికి అందజేసేవారు. 

ఈ నేపథ్యంలో ఉగ్రవాదులకు ఆర్థిక సహాయాన్ని అందజేసే వారిని అడ్డుకోవాలని భావించిన అధికారులు ఆమేరకు చర్యలు ప్రారంభించారు. ఉగ్రమూకలకు ఆర్థిక సహాయాన్ని అందజేసే జాహూర్ అహ్మద్ షాకు చెందిన బంగ్లాను అధికారులు గురుగావ్‌లో స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఇతను ఢిల్లీ తీహార్ జైలులో ఉన్నా, ఈయన ఆధ్వర్యంలో పెద్దమొత్తంలో నగదు ఉగ్ర సంస్థలకు చేరేది. 

పాకిస్తాన్‌కు చెందిన లష్కర్-ఇ- తోయిమా సంస్థ నుంచి ఇతనికి నగదు అందుతున్నట్టు ఇటీవలే ఈయన నుంచి ఈడీ స్వాధీనం చేసుకున్న పత్రాల ద్వారా వెల్లడైంది. ఇలాగే మరో 12మందిపై కూడా చర్యలు ప్రారంభించారు. టెర్రరిస్టులకు నగదు సహాయం నిలిచిపోతే ఉగ్రవాద కార్యకలాపాలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని, ఇలాంటి వారిపై దృష్టి సారించి ఆర్థిక సహాయం పూర్తిగా నిలిచిపోయేలా చర్యలు తీసుకుంటున్నట్టు భద్రతా దళాల అధికారులు తెలిపారు.