29న కర్నూల్ లో, 1న రాజమండ్రిలో మోదీ సభలు

ప్రధాని మోదీ ఈ నెల 29 కర్నూలు, ఏప్రిల్‌ ఒకటిన రాజమండ్రిలో జరగనున్న బిజెపి ఎన్నికల బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. ఈ సభల ద్వారా ఆయా ప్రాంతాల శాసనసభ, లోక్‌సభ అభ్యర్థులను పరిచయం చేయించేందుకు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. మోదీ ఫ్రిబవరి 10న గుంటూరు, మార్చి 1న విశాఖ నగరంలో జరిగిన పార్టీ బహిరంగ సభల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. 

స్వల్ప వ్యవధిలోనే ఇప్పుడు కర్నూలు, రాజమండ్రి సభల్లో పాల్గొనేందుకు వస్తున్నందున పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోందని నేతలు భావిస్తున్నారు. మరోవైపు ఈ నెల 26న పార్టీ ఎన్నికల ప్రణాళికను కేంద్ర రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ విజయవాడలో విడుదల చేస్తారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు. ఈ సందర్భంగా పీయూష్‌ మేధావులతో ప్రత్యేకంగా సమావేశం అవుతారని తెలిపారు.

రాష్ట్రానికి నిధులపై కరపత్రం
రాష్ట్ర విభజన అనంతరం కేంద్రం రాష్ట్రాభివృద్ధి కోసం పెద్దఎత్తున నిధులు విడుదల చేసిందని పేర్కొంటూ ఆయా వివరాలతో ప్రచురించిన కరపత్రాలను బిజెపి అభ్యర్థులు స్థానికులకు పంపిణీ చేస్తున్నారు. రాజధానికి రూ.2500 కోట్లు, రెవెన్యూ లోటు భర్తీకి రూ.22,170 కోట్లు కేటాయించినట్లు అందులో పేర్కొన్నారు. 

గుంటూరులో స్పైసెస్‌ పార్కు, కాకినాడలో ఫుడ్‌పార్కు, కృష్ణపట్నం ఇంటర్నేషనల్‌ లెదర్‌ కాంప్లెక్స్‌, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (మిసైల్‌ టెస్టింగ్‌ ఫెసిలిటీ, నాగాయలంక), రైల్వే జోన్‌, కడప, రాజమండ్రి విమానాశ్రయాల రన్‌ వే విస్తరణ, భోగాపురం, నెల్లూరు కర్నూలులో నూతన విమానాశ్రయాలు, సాగరమాల కింద రూ.1,64,000 కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టులు తదితర పథకాల గురించి కరపత్రాల్లో ముద్రించారు.

జన్మభూమి కమిటీల ద్వారా పెద్దఎత్తున అవినీతి జరిగిందని, టిడిపి నేతలు అక్రమాలకు పాల్పడ్డారని... బిజెపి  అభ్యర్థులు తమ ప్రచారంలో ఆరోపిస్తున్నారు. కేంద్ర పథకాలనే టిడిపి రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా ప్రచారం చేస్తోందని పేర్కొంటున్నారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (అర్బన్‌) కింద రూ.19 వేల కోట్లతో 12,42,000 ఇళ్లను మంజూరు చేసినట్లు చెబుతున్నారు. కడప స్టీల్‌ప్లాంట్‌కు మౌఖికంగా అంగీకారం తెలిపినట్లు ప్రచారం చేస్తున్నారు.

రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ప్రత్యేక హోదాకు మించి నిధులిస్తున్నా బిజెపి ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడంలేదని ఆదివారం విజయవాడలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు ధ్వజమెత్తారు.