కాంగ్రెస్ పాకిస్థాన్ లో గెలవాల్సిందే !

దేశంలో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లాయని స్పష్టం చేస్తూ ఆ పార్టీ అభ్యర్థులు పాకిస్థాన్ లో పోటీ చేస్తే మాత్రం ఘనంగా గెలుపొందుతారని బిజెపి ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఎద్దేవా చేశారు. అబద్ధాలు చెప్పడం, వాటితో ఎన్నికల్లో ప్రజల అభిమానంతో లబ్ధి పొందాలని ఆ పార్టీ ప్రయత్నిస్తున్నదని గౌహతిలో ధ్వజమెత్తారు. 

పొరుగు దేశం పాక్ కంటే ఎక్కువగానే కాంగ్రెస్ నాయకులు అబద్ధాలతో కూడిన ప్రకటనలు చేయడంలో దిట్టలుగా తయారయ్యారని ఆయన పేర్కొన్నారు. ‘వాళ్ల వ్యాఖ్యలు, విమర్శలు చూస్తుంటే మన దేశం కంటే పొరుగున ఉన్న పాకిస్తాన్‌లో విస్తృత ప్రచారం జరగడానికి ఆస్కారం ఉంది. ఇపుడు అక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తే కాంగ్రెస్ తప్పకుండా విజయం సాధిస్తుందని. ఇదీ ప్రస్తుతం మన దేశంలోని ప్రధాన ప్రతిపక్షం తీరు’ అని రామ్ మాధవ్ మండిపడ్డారు. 

‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న ఏ అంశంపై కూడా కాంగ్రెస్ పోరాడడం లేదు. కేవలం మా నాయకుడు, మా పార్టీపైనే దృష్టి సారించింది. ఇది ఒకరకంగా చూసుకుంటే అబద్ధాలు చెప్పడంలో దిట్ట అయిన పాకిస్తాన్‌తో సమానం’ అని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ‘ఆధారాలు లేని వాటిపై పోరాడుతోంది’ అని ఆయన దుయ్యబట్టారు. 

కాంగ్రెస్ పార్టీ అసలు మన దేశం కోసం పోరాడుతోందా? లేదా పాకిస్తాన్‌పైన అన్నది ప్రజలు అర్ధం చేసుకోలేకపోతున్నారని ఆయన తెలిపారు. భారత జవాన్ల త్యాగాలపై కూడా కాంగ్రెస్ నాయకులు సందేహాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలపై ప్రశ్నించకుండా కేవలం సాయుధ జవాన్ల త్యాగాలను అవమానించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.