ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో నలుగురు నక్సల్స్ హతం

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళతోపాటు నలుగురు నక్సలైట్లు హతమయ్యారు. కుక్రాజోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమియాబేడ్ అడవిలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం మేరకు గాలింపు చేపట్టిన డీఆర్జీ బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు ఆత్మరక్షణార్థం ఎదురు కాల్పులకు దిగారు. సు

మారు 90 నిమిషాలసేపు కాల్పులు జరిగాయి. నక్సల్స్ కాల్పులు జరుపుతూనే చెట్ల మాటున అడవిలోకి పారిపోయారని జిల్లా ఎస్పీ జితేంద్ర శుక్లా చెప్పారు. కాల్పులు ఆగిపోయిన తర్వాత ఘటనాస్థలంలో ఒక మహిళా మావోయిస్టుతోపాటు నలుగురు మావోయిస్టుల మృతదేహాలు, ఒక ఇన్సాస్, ఒక 303 రైఫిల్ లభించాయి.

మృతుల్లో ఝారా ఎల్వోఎస్ కమాండర్ రాటి, నెల్నార్ ఏరియా కమిటీ కమాండర్ సొమ్లుగా గుర్తించారు. మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉంది. మృతుల్లో ఇద్దరిపై రూ.5 లక్షల చొప్పున నగదు రివార్డు ఉన్నదని పోలీసులు చెప్పారు.

మరోవైపు ఛత్తీస్‌గఢ్ నుంచి మావోయిస్టులు అపహరించుకు వెళ్లిన ఇద్దరు పౌరుల మృతదేహాలు పొరుగున ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఎట్టపల్లి తాలుకా గట్ట ప్రాంతంలోని తాడ్గుడ రోడ్డు పక్కన పడి ఉన్నాయి. మృతులను సోనా పధా (35), సోమ్జీ పధా (40)గా గుర్తించామని జిల్లా ఎస్పీ శైలేశ్ బాల్కావాలే తెలిపారు. వారిని గత నెల 26న అపహరించుకు వెళ్లారు.