భార్యాభర్తలిద్దరూ వేర్వేరు పార్టీలైతే తప్పేమిటి !

తాను బీజేపీలోనూ, తన భర్త వెంకటేశ్వరరావు వైసీపీలోనూ పనిచేస్తూ ఎన్నికల్లో పోటీ చేస్తుంటే టీడీపీకి కడుపుమంట ఎందుకని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ విశాఖ ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధ్రీశ్వరి ప్రశ్నించారు. విశాఖలోఆమె విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ భార్యాభర్తలిద్దరూ వారికి నచ్చిన పార్టీలో ఉంటూ ఎన్నికల్లో పోటీ చేసే స్వతంత్య్రం లేదా?  అని ప్రశ్నించారు. 

ఎవరి రాజకీయ ఇష్టాలు వారివి, ఒకరినొకరు గౌరవించుకోవడం తప్పా అని అడుగుతూ ఎన్నికల్లో వేర్వేరు పార్టీల తరపున పోటీ చేయడం తమ వ్యక్తిగత విషయం అని స్పష్టం చేశారు.  దీనిపై కొన్ని రాజకీయ పార్టీలు విమర్శలకు తెర తీయడంపై ఆమె ఘాటుగా స్పందించారు. "నా నిర్ణయానికి గౌరవం ఇచ్చి నా భర్త రాజకీయ స్వేచ్ఛ ఇచ్చారు. మహిళా సాధికారిత అంటూ గొప్పలు చెప్పుకునే ఆయా పార్టీలు మహిళగా తన నిర్ణయాన్ని ప్రశ్నించడంలో ఔన్నత్యం ఏమిటో స్పష్టంగా వెల్లడించాలలి?" అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తన రాజకీయ ప్రస్థానమే అనూహ్యంగా జరిగిందని చెబుతూ 2004 ఎన్నికల్లో బాపట్ల పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీచేసిన తాను, 2009 ఎన్నికల్లో బాపట్ల స్థానం రిజర్వ్ కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో విశాఖకు వచ్చానని తెలిపారు. విశాఖ ప్రజలు తనను గెలిపించారని, కాంగ్రెస్ మంత్రి పదవి ఇచ్చిందని పేర్కొన్నారు. ఐదేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసిన తాను విశాఖ సమగ్రాభివృద్ధికి ఎంతో చేశానని చెప్పారు. 

పారిశ్రామిక నగరం విశాఖలో ఖాయిలాదశలో ఉన్న బీహెచ్‌పీవీని బెల్‌లో విలీనం చేయడం, పోర్టు విస్తరణ, విశాఖ విమానాశ్రయానికి అంతర్జాతీయ స్థాయి కల్పన సాధించానని ఆమె గుర్తు చేశారు. విశాఖ ప్రజలు వేసే ఓటు ఒక రాజకీయ పార్టీకో, అభ్యర్ధికో కాకుండా ఈ ప్రాంతంతోపాటు రాష్ట్రం, దేశం ప్రగతి సాధించేందుకు దోహదం కావాలని ఆమె సూచించారు. 

అవినీతి రహిత, సమర్ధవంతమైన పాలన కోసం నరేంద్ర మోదీని మరోసారి ప్రధానిని చేసేందుకు మీ ఓటు ఉపయోగపడాలని పురంధ్రీశ్వరి పిలుపునిచ్చారు. సంక్లిష్ట సమయంలో కూడా ప్రభుత్వం, పార్టీని పక్కనపెట్టి దేశం కోసం ప్రధాని మోదీ కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెబుతూ నోట్ల రద్దు, జీఎస్టీ, త్రిపుల్ తలాక్ బిల్లు వంటివి అందుకు ఉదాహరణగా  ఆమె పేర్కొన్నారు. సమర్ధవంతమైన నాయకత్వం ఉంటేనే దేశం అభివృద్ధి సాధిస్తుందని, అందుకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలని పిలుపునిచ్చారు.