సైనికుల తయాలను గౌరవించడం కాంగ్రెస్ కు తెలియదు

సైనికులను, వారి త్యాగాలను గౌరవించడం కాంగ్రెస్‌కు తెలియదని కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ విమర్శించారు. సైన్యాన్ని కించపరచరాదని మిత్రపక్షాలు చెబుతున్నా, కాంగ్రెస్‌ బుద్ధి ఎంతకీ మారడం లేదని ఆమె ధ్వజమెత్తారు. 

 హైదరాబాద్‌లోని మల్కాజిగిరి బిజెపి ఎంపీ అభ్యర్థి రాంచందర్‌రావు అధ్యక్షతన మాజీ సైనికాధికారులు, సైనికులు, మేధావులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ బాలాకోట్‌పై భారత సేన దాడి అనంతరం అందరూ జేజేలు పలుకుతుంటే, కొందరు మాత్రం దాడికి ఆధారాలు అడుగుతున్నారని ఆమె తీవ్ర నిరసన వ్యక్తపరిచారు. ‘అలా అడగటం రాజకీయాలు చేయడం కాదా’ అని కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఆమె ప్రశ్నించారు.

సైనిక బలగాలకు సంబంధించిన ఆర్మీ చీఫ్‌ను, వైమానిక దళ ప్రధానాధికారిని కాంగ్రెస్‌ దూషించడం సిగ్గుపడాల్సిన విషయమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అది పస లేని ఆరోపణలు చేస్తోందని, బిజెపి మాత్రం సైనికుల త్యాగాలను గుర్తించి ‘వార్‌ మెమోరియల్‌’ను నిర్మించి జాతికి అంకితం చేసిందని పేర్కొన్నారు. 

రఫేల్‌ పైనా కాంగ్రెస్‌ ఎంతో రాద్ధాంతం చేస్తోందని చెబుతూ వచ్చే సెప్టెంబరులో మొదటి యుద్ధవిమానం దేశానికి వస్తుందని, 2022లో అదే నెలనాటికి మొత్తం 36 విమానాలు వస్తాయని ఆమె వెల్లడించారు. మాజీ సైనికుల పింఛన్ల కోసం ఏటా రూ.35,000 కోట్లు ఖర్చుచేస్తున్నామని, ‘ఎయిమ్స్‌’ స్థాయి సౌకర్యాలతో దేశంలో మూడు ఈసీహెచ్‌ఎస్‌ ఆసుపత్రులు నిర్మిస్తున్నామని మంత్రి ప్రకటించారు. 

అయిదేళ్ల పాలనతో దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లిన మోదీకి మరోసారి అవకాశం ఇవ్వకుంటే, దేశం 50 ఏళ్లు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని రక్షణ మంత్రి హెచ్చరించారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గాల పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో  ప్రసంగించిన ఆమె- కుటుంబ పాలన దేశానికి, రాష్ట్రానికి మంచిది కావని స్పష్టం చేశారు. 

కేంద్రంలో నరేంద్రమోదీ నేతృత్వంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటవుతుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తంచేశారు. దేశ రక్షణకు, సమగ్ర అభివృద్ధి కోసం మోదీ మరోసారి అధికారంలోకి రావాలని ఆమె ఆకాక్షించారు.