పంచభూతాలనూ దోచుకున్న కాంగ్రెస్

పంచభూతాలనూ దోచుకున్న కాంగ్రెస్ ఇంకా దేశాన్ని వదలడం లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ధ్వజమెత్తారు.   ‘మైభీ చౌకీదార్’ (నేను కూడా కాపలాదరుడినే) పేరుతో హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంతోపాటు, ప్రియాంక జీ అరోరా ఆధ్వర్యంలోని ఫిక్కీ మహిళా విభాగం ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనూ పీయూష్ గోయల్ మాట్లాడారు.

ప్రధానిగా మళ్లీ నరేంద్ర మోదీ రావడం ఇష్టం లేని ముఠా రాజకీయ పార్టీలు, అవినీతి నేతలు కలిసి ఒక త్రాటిపైకి వచ్చారని, వారికి దేశపరమైన బాధ్యత ఏమీ లేదని దుయ్యబట్టారు. కేవలం మోదీని అడ్డుకోవడమే లక్ష్యమని వారు చెప్పడం చూస్తుంటే సిగ్గుగా ఉందని మండిపడ్డారు. 

130 కోట్ల మంది భారతీయుల్లో దేశం కోసం పనిచేసే ప్రతి ఒక్కరూ చౌకీదారేనని వ్యాఖ్యానించారు. విద్యుత్ లేని గ్రామం అంటూ లేకుండా చేశామని, ప్రతి గ్రామానికీ నేడు విద్యుత్ వెలుగులు నింపామనీ చెప్పారు. పన్ను చెల్లించేందుకు, ఆదాయ పరిమితిని ఐదు లక్షల రూపాయల వరకూ పెంచామని తెలిపారు. దీనివల్ల మూడు కోట్ల మంది మినహా మిగిలిన వారంతా టాక్స్ నుండి మినహాయింపు పొందుతారని చెప్పారు.

ఐదేళ్ల పాలనలో ప్రతి మే 25వ తేదీన దేశ అభివృద్ధిపై ప్రగతి నివేదికను ప్రజల ముందుంచిన ఏకైక ప్రభుత్వం తమదేనని గుర్తు చేశారు. ఎల్‌ఈడీ బల్బులను కేవలం 38 రూపాయిలకే ఇచ్చి కరెంట్ వినియోగం తగ్గించడమేగాక, 24 గంటల విద్యుత్ కల్పిస్తున్నామని పేర్కొన్నారు. 

2008లో తీవ్రవాదులు ముంబైలో దాడికి దిగినపుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని పీయూష్ గోయల్ నిలదీశారు. దానిపై నేటికీ ఎందుకు జవాబు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దేశ రక్షణ విషయంలో వెనక్కు తగ్గేది లేదని, ఎందుకంటే ఈ దేశానికి నిజమైన చౌకీదార్లు బీజేపీ నేతలు మాత్రమేనని స్పష్టం చేశారు. 

దేశవ్యాప్తంగా మోదీ ప్రభుత్వం చేపట్టిన పథకాలు ఫలితాలను ఇచ్చాయని,  అందుకే, మోదీ ప్రభుత్వం తిరిగి కేంద్రంలో రావాలని దేశ ప్రజలు అంతా ఎదురుచూస్తున్నారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ ఎపుడూ కట్టుబడే ఉంటుందని చెబుతూ గత ఐదేళ్లలో అనేక పథకాలకు అనుమతి ఇవ్వడమేగాక నిధులను సమకూర్చామని తెలిపారు. 

ఎయిమ్స్, ట్రైబల్ వర్శిటీ వంటి విద్యాసంస్థలకు సైతం అనుమతి ఇచ్చామని ఆయన గుర్తుచేశారు. కార్పొరేట్ సంస్థలకు, వ్యాపారవేత్తలకు తమ కార్యకలాపాల్లో తెలికైన విధానాలను అమలుచేస్తున్నామని, అందులో భాగంగానే జీఎస్‌టీ అమలు చేస్తున్నామని అన్నారు.