దక్షిణ కోల్‌కతా నుంచి సుభాష్ మనవుడి పోటీ

ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని ప్రతిష్ఠాత్మకమైన దక్షిణ కోల్‌కతా స్థానానికి బీజేపీ దేశ స్వాతంత్య్ర సమరంలో అసమాన చైతన్యాన్ని ప్రదర్శించిన సుభాష్ చంద్రబోస్ మనుమడు చంద్రకుమార్ బోస్‌ను నిలిపింది. 

సుభాష్ చంద్రబోస్ పట్ల బెంగాల్ ప్రజల్లో ఆదరాభిమానాలు అంతాఇంతా కావు. ఈ అభిమానాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన మనుమడిని కమలం పార్టీ పోటీలో నిలిపింది. చంద్రకుమార్ బోస్ కోల్‌కతా దక్షిణ్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. 

బెంగాల్‌లో అస్తిత్వమే లేని బీజేపీ అక్కడ పాగా వేయడానికి నాలుగేండ్ల నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే నేతాజీని సొంతం చేసుకొనే ప్రయత్నం చేసింది. గతేడాది అక్టోబర్ 21న బోస్ 75వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని రెడ్‌ఫోర్ట్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. బోస్ కుటుంబంపట్ల గత పాలకుల ఉద్దేశపూర్వక నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు. తాము బోస్ ప్రతిష్ఠకు పూర్వ వైభవం తెస్తామని తెలిపారు. 

ఇప్పుడు ఆయన తమ పార్టీ తరఫున చంద్రకుమార్ బోస్‌ను ఎన్నికల బరిలోకి దించడాన్ని ఆ క్రమంలో భాగంగా చోటుచేసుకున్న ఘటనగానే చూడాలని పరిశీలకులు అంటున్నారు. మరి, అక్కడ ఆయన విజయావకాశాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరం.