అమేథీలో రాహుల్ కు సవాల్ విసురుతున్న స్మృతీ ఇరానీ

సరిగ్గా ఐదేండ్ల కిందట... గాంధీ-నెహ్రూ కుటుంబానికి కంచుకోట అయిన ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా స్మృతీ ఇరానీని ప్రకటించి బీజేపీ అందరినీ ఆశ్చర్యపరిచింది. గాంధీ కుటుంబ వారసుడైన రాహుల్ గాంధీని ఢీకొట్టేందుకు స్మృతీని బరిలో నిలిపింది. అమేథీ మొదటి నుంచీ కాంగ్రెస్‌కు బలమైన స్థానం.

 గతంలో ఇక్కడి నుంచి సంజయ్‌గాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ ఎన్నికై పార్లమెంటులో అడుగుపెట్టారు. రాహుల్ గాంధీ అప్పటికే రెండుసార్లు ఇక్కడి నుంచి గెలుపొందారు. 2009 ఎన్నికల్లో 3.70 లక్షల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. మరోవైపు స్మృతీ ఇరానీ ఉత్తర్‌ప్రదేశ్‌కు కొత్త. 2004లో ఆమె ఢిల్లీలోని చాందీన్ చౌక్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌నేత కపిల్ సిబల్‌పై పోటీచేసి ఓటమిపాలయ్యారు. 

దీంతో ఇక్కడ స్మృతీ ఇరానీ విజయంపై సొంత పార్టీ నేతలకే నమ్మకం లేదు. అయితే పార్టీ ప్రధాన కార్యదర్శిగా, మహిళా మోర్చా అధ్యక్షురాలిగా, రాజ్యసభ ఎంపీగా, ప్రచారకర్తగా తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించిన ఆమెపై నాటి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ, పార్టీ ప్రధాన కార్యదర్శి, యూపీ ఇంచార్జీ అమిత్‌షా విశ్వాసం ఉంచారు. దీంతో ఆమె నియోజకవర్గమంతా విస్తృతం గా పర్యటించారు. 

కాంగ్రెస్ అధినాయకత్వం దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ నియోజకవర్గం వెనుకబడి ఉండడాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. కాంగ్రెస్‌లో గుబులు పుట్టించారు. ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ, రాహుల్ మెజారిటీని గణనీయంగా తగ్గించడంలో (3.70 లక్షల నుంచి 1.07 లక్షలకు) ఆమె విజయం సాధించారు. 

కాంగ్రెస్ కంచుకోటలో కాషాయ జెండా ఎగురవేసి, కొత్త చరిత్ర లిఖిస్తామని పార్టీ నేతలు కూడా విశ్వాసంతో ఉన్నారు. ఈసారి రాహుల్‌కు బలమైన ప్రత్యర్థిగా ఆమె కనబడుతున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లోనూ కలవరం మొదలైంది. అందుకే రాహుల్‌గాంధీ ఇంకో సీటు నుంచి కూడా పోటీ చేసేందుకు యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

  అమేథీలో ఓటమితో ఆమె ఇక నియోజకవర్గాన్ని తిరిగిచూడరని ప్రత్యర్థులు భావించారు. అయితే ఓటమిని సవాల్‌గా తీసుకున్న ఆమె అమేథీని తన రెండో ఇల్లుగా చేసుకున్నారు. వీలు చిక్కినప్పుడల్లా నియోజకవర్గంలో పర్యటించి, స్థానికులు, పార్టీ నేతలతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో పట్టు కోల్పోకుండా చర్యలు తీసుకున్నారు. కేంద్ర మంత్రిగా అమేథీలో పలు అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టారు.