మితిమీరిన నోట్ల వాడకంతో అనారోగ్యం

డిజిటల్ ఇండియా కేవలం ఆర్ధిక వ్యవహరాలలో పారదర్శకత తీసుకొచ్చి, నల్లధనన్ని అరికట్టడం కోసం మాత్రమె కాదు, ప్రజల ఆరోగ్యానికి సహితం దోహద పడుతుందని భావిస్తున్నారు. కరెన్సీ నోట్లను మితిమీరి ఉపయోగిస్తే కొన్ని రకాల రోగాలకు దారితీస్తున్నట్లు తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా కొత్తనోట్లపై మోజు ప్రమాదకరమని పరిశోధకులు హెచ్చరిస్తునారు.

 

కొత్త నోట్లు మనుషులకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నట్లు పలు వార్త కధనాలు సహితం వెలువడుతున్నాయి. వాటిపై ప్రస్తుతం సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతూ ఉండడంతో అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) కూడా స్పందించింది. ఈ క్రమంలోనే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి ఈ విషయం గురించి ఓ లేఖను కూడా వ్రాసారు.

ఈ అధ్యయనాలు, వార్తల్లో నిజానిజాలను విచారణ జరిపి కనిపెట్టాలని ఆర్ధిక మంత్రిని  సీఏఐటీ కోరింది. ప్రజల రక్షణార్థం వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలనూ తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేసింది. ఈ లేఖా ప్రతులను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, శాస్త్ర-సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్‌లకు కూడా పంపించింది. తక్షణమే ఈ అంశంపై దర్యాప్తు జరుపాలని కోరిని సీఏఐటీ తమ దృష్టికి వచ్చిన అధ్యయనాలు, వార్తల వివరాలను అందించింది.

కరెన్సీ నోట్ల వాడకం ఆరోగ్యానికి హానికరమని, వాటిలో వ్యాధికారకాలున్నాయని వివిధ అధ్యయనాల్లో తేలినట్లు వార్తలు వస్తున్న విషయాన్ని సీఏఐటీ లేఖలో గుర్తుచేసింది. మూత్రకోశ వ్యాధులు, శ్వాసకోశ అంటు రోగాలు, వివిధ రకాల చర్మ, నోటి, జీర్ణాశయ సమస్యలు నోట్ల వల్ల మనుషులకు సంక్రమిస్తున్నాయని లేఖలో సీఏఐటీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ పేర్కొన్నారు. రోజూ కరెన్సీ నోట్లతో వ్యాపారులు పెద్ద ఎత్తున లావాదేవీలు జరుపుతారని, ఒకవేళ ఈ అధ్యయనాలు, వార్తలు నిజమైతే మొదటగా ప్రభావితులయ్యేది వర్తకులేనని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వినియోగదారులకూ ఇబ్బందేనని చెప్పారు.

కాబట్టి ప్రభుత్వంతోపాటు భారతీయ వైద్య మండలి, భారతీయ వైద్యుల సంఘం కూడా ఈ అంశంపై సత్వరమే దృష్టి పెట్టాలని, లోతైన పరిశోధనలు నిర్వహించి ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం లేకుండా చూడాలని కోరారు.  ఇదిలావుంటే కొన్ని సైన్స్ ఆధారిత పత్రికలు, మ్యాగజైన్లు మాత్రం దాదాపు ఏటా ఇలాంటి అధ్యయనాలు, కథనాలు, వార్తలు వస్తూనే ఉంటాయని అంటున్నాయి. అయినప్పటికీ ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్న ఈ రిపోర్టులపై ఎలాంటి విచారణలు జరుగలేకపోతుండటం బాధాకరమని చెబుతున్నాయి.