మాండ్యలో సుమలతకు బిజెపి మద్దతు

కర్ణాటకలోని మండ్య నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రముఖ నటి, దివంగత నటుడు అంబరీశ్‌ సతీమణి సుమలతకు బిజెపి మద్దతు ప్రకటించింది. ఆ నియోజకవర్గంలో తమ పార్టీ పోటీ చేయడం లేదని తెలిపింది. 

ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి కుమారుడు, నటుడు నిఖిల్ పోటీ చేస్తున్నారు. అందుకనే జేడీఎస్ తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ సుమలతను అభ్యర్థిగా ప్రకటించడానికి నిరాకరించడంతో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పైగా, ఆమెకు దర్శన్ వంటి ప్రముఖ కన్నడ నటులు కూడా మద్దతు ప్రకటించి, ప్రచారంలో పాల్గొంటూ ఉండడంతో కుమారస్వామి ఆత్మరక్షణలో పడ్డారు. 

తనకు ఎన్నికల్లో మద్దతివ్వమని సుమలత కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ ఎమ్‌ కృష్ణతో పాటు రాష్ట్ర బీజేపీ నాయకులను కలిసి కోరారు. దీంతో మండ్య నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థిని పోటీలో నిలపవద్దని ఆ పార్టీ నిర్ణయించింది. బీజేపీ పోటీ నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు సుమలత, నిఖిల్ ల మధ్య ప్రత్యక్ష పోరుగా ఎన్నికల రంగం మారింది. 

సుమలతకు మద్దతు తెలుపుతున్న నటుడు దర్శన్ ఇంటిపై శనివారం ఉదయం దుండగులు దాడి చేశారు. ఆయన కారుకు నష్టం కలిగించారు. అటువంటి వేధింపు చర్యల వల్లనా ఏమీ ప్రయోజనం సాధించలేరని సుమలత హెచ్చరించారు. తనకు మద్దతు ఇస్తున్న నటులను బెదిరించడం, వారిపై దాడులకు దిగడం పట్ల ఆమె తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.