ద‌ళితుడిన‌ని కెసిఆర్ చిన్న చూపు...వివేక్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనను నమ్మించి గొంతు కోశారని లోక్ సభ మాజీ సభ్యుడు, టీఆర్ఎస్ నేత వివేక్ విమర్శించారు. దళితుడిని అయినందుకే తనను కేసీఆర్ చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారుడినైన తనకు సముచిత స్థానం కల్పిస్తానని చెప్పడంతోనే టీఆర్ఎస్ లో చేరానని గుర్తుచేశారు. 

అప్పుడు పెద్దపల్లి జిల్లాను వెంకటస్వామి జిల్లాగా మారుస్తామన్న కేసీఆర్ మాట తప్పారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి నమ్మించి గొంతు కోస్తారని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కేసీఆర్ ను ఎప్పుడూ టికెట్ అడగలేదని వాళ్లే అనేకసార్లు పెద్దపల్లి టికెట్‌ తనకు ఇస్తామంటూ మభ్యపెట్టారని ఆరోపించారు. 

పెద్దపల్లిలో అనుచరులు, మద్దతుదారులతో సమావేశమైన వివేక్ ‘మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించా. పెద్దపల్లి పరిధిలో టీఆర్‌ఎస్‌ పార్టీకి జీవం పోసింది నేనే. నా పేరు లోక్ సభ అభ్యర్థుల జాబితాలో లేకపోవడం బాధాకరం. టీఆర్‌ఎస్‌లో నేను ఎవరినీ మోసం చేయలేదు. గెలిచిన ఎమ్మెల్యేలు నాపై తప్పుడు సమాచారం ఇచ్చారు. శాసనసభ ఎన్నికల్లో నేను టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు వ్యతిరేకంగా పని చేసినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా’ అని స్పష్టం చేశారు. 

లోక్ సభ అభ్యర్థిగా టికెట్ దక్కినా, దక్కకున్నా పెద్దపల్లి ప్రజలతోనే ఉంటానని తేల్చిచెప్పారు.  ఆయన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు.  ప్రస్తుత పరిస్థి తుల్లోనే తాను ప్రభుత్వ సలహదారు పదవికి రాజీనామా చేస్తున్నట్టు స్పష్టం చేశారు. రాజీనామాను వెంటనే ఆమోదించాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. పెద్దపల్లి ప్రజలకు తన తండ్రి వెంకటస్వామిలాగే తానూ సేవ చేశానన్నారు. ప్రభుత్వ సలహదారు హోదాలో ఎలాంటి ఆర్థిక ప్రయోజనం పొందలేదని వివేక్‌ చెప్పారు.