పార్టీ లోగోలో `కాంగ్రెస్' పదం తొలగించిన మమతా

బిజెపియేతర పక్షాలలో కాంగ్రెస్ పేరు పట్లనే అసహనం వ్యక్తం అవుతున్నది. తాజాగా, తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆ పార్టీకి చెందిన లోగోల్లో ‘కాంగ్రెస్’ అనే పదం కనపడదు. 

మొదట కాంగ్రెస్‌ నేతగా ఉన్న పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. టీఎంసీని స్థాపించిన 21 ఏళ్ల తర్వాత తమ పార్టీ లోగోల్లోంచి ‘కాంగ్రెస్‌’ అనే పదాన్ని తొలగించారు. 

ఆ పార్టీ కొత్త లోగోలో తృణమూల్‌ అనే పదం ఆకుపచ్చ రంగులో కనపడుతోంది. దానిపై రెండు పుష్పాలు ఉన్నాయి. వెనకవైపున నీలిరంగు ఉంటుంది. 

వామపక్ష పార్టీలకు కంచుకోట వంటి పశ్చిమ బెంగాల్‌లో సీపీఎంను ఎదుర్కొని నిలబడంలో వచ్చిన విభేదాల కారణంగా మమతా బెనర్జీ 1998లో కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చేసి టీఎంసీని స్థాపించారు. అప్పటి నుంచి ఆ పార్టీలోగోల్లో తృణమూల్‌ పక్కనే కాంగ్రెస్‌ అనే పదం ఉంటోంది.

‘21 ఏళ్ల తర్వాత టీఎంసీ ఇకపై తృణమూల్‌గా పిలవబడుతుంది. మార్పునకు సమయం వచ్చింది’ అని టీఎంసీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. తమ పార్టీకి చెందిన బ్యానర్లు, పోస్టర్లతో పాటు ఇతర అన్ని వ్యవహారాల్లోనూ కాంగ్రెస్‌ అనే పదాన్ని తొలగించారు. 

అయితే, ఎన్నికల సంఘం వద్ద నమోదైన పేరులో మాత్రం తృణమూల్‌ కాంగ్రెస్‌గానే ఉంటుందని ఆ పార్టీ తెలిపింది. ఇప్పటికే మమతా బెనర్జీ అధికారిక ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ఖాతాలతో పాటు ఆమె మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ, తృణమూల్‌ రాజ్యసభ సభ్యుడు డెరెక్‌ ఒబ్రెయిన్‌కు చెందిన సామాజిక మాధ్యమాల్లోనూ ఈ లోగోలు దర్శనమిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఆ పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.