తన అనుచరులను చూస్తే లోహియా ఆత్మా క్షోభిస్తుంది

దేశంలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలను చూస్తే  ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు రామ్‌ మనోహర్‌ ఆత్మ క్షోభిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. లోహియా జయంతి సందర్భంగా ప్రధాని ఆయనను స్మరించుకుంటూ..ప్రతిపక్షాలపై విరుచుకుపడుతూ లోహియా  అనుచరులుగా చెప్పుకొంటున్న పార్టీలు ‘మహాకల్తీ కూటమి’గా ఏర్పాటయ్యాయని ప్రధాని ధ్వజమెత్తారు. 

‘‘ప్రస్తుతం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను చూస్తే లోహియా భయపడిపోయేవారు. ఆయన అనుచరులం అంటూ అబద్ధ ప్రచారాలు చేసుకుంటున్న పార్టీలు అధికారం కోసం అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నాయి. కాంగ్రెస్‌తో కలిసి మహాకల్తీ కూటమి ఏర్పాటు చేస్తున్నారు. అధికారం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. పార్లమెంటు లోపల లేదా వెలుపల లోహియా మాట్లాడితే కాంగ్రెస్‌ అప్పట్లో కంపించిపోయేది.’’ అని మోదీ శనివారం తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు.

కాంగ్రెస్‌ను దారుణ పార్టీగా అభిర్ణించిన మోదీ.. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయ, పారిశ్రామిక, రక్షణ రంగాల్లో దేశం ఎలాంటి అభివృద్ధి సాధించలేదని లోహియా వ్యాఖ్యానించారని మోదీ గుర్తు చేశారు. స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం కోసం లోహియా కృషి చేశారని, అయితే  ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆయన అనుచరులుగా చెప్పుకుంటున్న వారు ముస్లిం మహిళల భద్రత కోసం తెచ్చిన ట్రిపుల్‌ తలాఖ్‌ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని దుయ్యబట్టారు. 

ఈరోజు లోహియా సిద్ధాంతాలను మరచినవారు..రేపు ప్రజలను కూడా విస్మరించడం ఖాయమని ప్రధాని స్పష్టం చేశారు. లోహియా స్ఫూర్తితో బిజెపి అనేక కార్యక్రమాలు చేపట్టిందని చెబుతూ అందులో భాగంగానే పీఎం కిసాన్‌  సమ్మాన్‌ నిధి, కృషి సింఛాయ్‌ యోజన, ఈ-నామ్‌ లాంటి పథకాలకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. 

సామ్యవాద సిద్ధాంత కర్త రామ్‌ మనోహర్‌ లోహియా దేశ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారని,  ప్రజాస్వామ్యం, సామ్యవాద సిద్ధాంతాల కోసం తీవ్రంగా కృషి చేశారని ప్రధాని ఘనంగా నివాళులు అర్పించారు. రాజకీయాల్లో ఎంతో మందికి ఆదర్శ నేతగా కీర్తి గడించారని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో 1910 మార్చి 23న జన్మించిన లోహియా విద్యార్థి దశ నుంచే స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. 1928 లో సైమన్‌ కమిషన్‌కు వ్యతిరేకంగా చేపట్టిన విద్యార్థి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.