మాయావతి, పవర్ పోటీకి వెనుకడుగు మోదీ గెలుపుకు సంకేతం !

ప్రస్తుత  సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోమంటూ బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్ ప్రకటించడం ఎన్డీఏ గెలుపునకు కచ్చితమైన సంకేతమని శివసేన వ్యాఖ్యానించింది. ఈ మేరకు తన పత్రిక సామ్నా సంపాదకీయంలో విశ్లేషిస్తూ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ రాక యూపీలో ఎస్పీ-బీఎస్పీ పొత్తును చిన్నాభిన్నం చేసిందని, ఎందుకంటే మాయావతి, కాంగ్రెస్ ఓటు బ్యాంకులు ఒకటేనని తెలిపింది. 

ఈ ఎన్నికల్లో తాము పోటీ చేయమంటూ శరద్‌పవార్, మాయావతి ప్రకటించడం చూస్తుంటే కేంద్రంలో మళ్లీ నరేంద్రమోదీ నాయకత్వంలో ఎన్డీఏ అధికారం చేపట్టడం ఖాయమన్న విషయాన్ని స్పష్టం చేస్తోందని తెలిపింది. వాస్తవానికి వీరిద్దరూ ప్రధాన మంత్రి పదవి రేసులో ఉన్నారని, అయితే ఎన్నికలకు ముందే చేతులెత్తేసారని శివసేన ఎద్దేవా చేసింది. తమకు ప్రధాని అయ్యే ఎలాంటి అవకాశాలు లేవని తెలిసే వారు ముందే పోటీ నుంచి తప్పుకున్నారని తెలిపింది. 

దేశవ్యాప్తంగా తమ పార్టీకి ప్రచారం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని, అందుకే తాను ఈ సాధారణ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని మాయావతి ప్రకటించడాన్ని శివసేన ప్రస్తావిస్తూ బిఎస్పీకి యూపీలో తప్ప ఎక్కడా ఉనికి లేదని గుర్తు చేసింది. అలాంటప్పుడు ఆమె ప్రచారం సాకుతో పోటీ నుంచి తప్పుకోవడం చూస్తే పోటీనుంచి తప్పుకుని యుద్ధానికి ముందే అస్త్ర సన్యాసం చేసినట్టు అర్థమవుతోందని ధ్వజమెత్తింది. 

పవార్ సైతం మాధ లోక్‌సభ స్థానం నుంచి ఇలాగే పలాయనం చిత్తగిస్తున్నారని పేర్కొంది. దేశంలోని విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్న పవార్ సొంత కుటుంబ సభ్యులు, పార్టీ సభ్యుల్లో ఐకమత్యాన్ని కుదర్చలేక పోటీ నుంచి తప్పుకున్నారని శివసేన ఆరోపించింది. ఎన్సీపీకి రాజీనామా చేసిన రంజిత్ సిన్హ్ మోహైట్ పాటిల్ బీజేపీలో చేరడం పవార్‌కు పెద్ద దెబ్బేనని తెలిపింది. 

పాటిల్  నిష్క్రమణతో ఇప్పటి వరకు నెమ్మదిగా నడుస్తున్న సెకండ్ హ్యాండ్ క్లాక్ లాంటి ఎన్సీపీ ఇప్పుడు పూర్తిగా ఆగిపోయే పరిస్థితి వచ్చిందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో దళితులు, యాదవులు పెద్దయెత్తున మోదీకి అండగా నిలిచి బీజేపీకి ఓటు వేయడం వల్లే మాయవతి ఒక్క సీటును కూడా గెల్చుకోలేకపోయిందని, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందని శివసేన తెలిపింది.

 ప్రియాంక టూరిజం పర్యటనలకు మంచి స్పందన వస్తోందని, ఇది మాయవతిలో భయాన్ని పుట్టిస్తోందని శివసేన అవహేళన చేసింది. మాయావతి ఇప్పుడు ఎక్కువగా భయపడుతున్నది కాంగ్రెస్‌ని చూసే తప్ప, బీజేపీని చూసి కాదని, అందుకే ఆమె ఈ ఎన్నికల్లో పో టీ చేయడం లేదని శివసేన పేర్కొన్నది.