సీట్ రాకపోతే పార్టీ మారే మనిషినా !

టిక్కెట్ రానంత మాత్రాన తాను పార్టీ మారే మనిషిని కాదని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. ప్రస్తుతం తనకు ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ సీట్ ను బిజెపి జి కిషన్ రెడ్డికి ఇవ్వడంతో తనకు అసంతృప్తిగా ఉన్నానన్న కథనాలను కొట్టి పారవేసారు. 

బీజేపీలో తన రాజకీయ ప్రస్థానం 1980లో ప్రారంభమైందని, తనకు టిక్కెట్ ఇవ్వమని ఎన్నడూ అధిష్టానవర్గాన్ని కోరలేదని తెలిపారు. అయినా పార్టీ తనకు ఎన్నో అవకాశాలు ఇచ్చిందని, తనకు పూర్తి సంతృప్తి ఉందని చెప్పారు.  సికింద్రాబాద్ పార్లమెంటు నుండి బీజేపీ అభ్యర్ధిగా ఉన్న కిషన్‌రెడ్డికి తన ఆశీర్వాదం ఎపుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. 

బీజేపీ వేగంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తోందని చెప్పారు. కేసీఆర్ చెబుతున్నట్టు వంద శాతం సీట్లు టీఆర్‌ఎస్‌కు వస్తాయని అనుకోవడం భ్రమ మాత్రమేనని ఎద్దేవా చేశారు. బీజేపీ జాతీయ పార్టీ అని, టీఆర్‌ఎస్ కేవలం ప్రాంతీయ పార్టీ మాత్రమేనని గుర్తు చేశారు. బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు మాత్రమే నేషనల్ కేడర్ ఉన్న పార్టీలు అని తెలిపారు. 

కాంగ్రెస్ పార్టీ లీడర్లను పోగొట్టుకుందని, దేశం కోసం కేసీఆర్ కాదని, దేశం కోసం మోదీని మాత్రమే ప్రజలు స్వాగతిస్తారని స్పష్టం చేశారు.  కేసీఆర్‌కు తెలిసిన హిందూత్వం కేవలం పూజలు, యాగాలు చేయడమేనని, బీజేపీ చేస్తున్న హిందూత్వం జాతీయతకు సంబంధించిందని పేర్కొన్నారు. 

కేసీఆర్‌కు ఒక స్పష్టమైన ఆలోచనా విధానం లేదని, రామమందిరం గురించి బీజేపీ ఎపుడూ స్పష్టంగా ఉందని తెలిపారు. కాంగ్రెస్ నాయకురాలు సునీత లక్ష్మారెడ్డిని బీజేపీలోకి రమ్మని కోరామని, ఆమె బీజేపీలో చేరుతుందని తాను ఆశిస్తున్నానని దత్తాత్రేయ చెప్పారు.