బంధుగణంతో అల్లుకు పోయిన టిడిపి అభ్యర్థుల జాబితా

సార్వత్రిక ఎన్నికల వేళ అధికార టీడీపీ జాబితా ఇలా బంధుగణంతో అల్లుకుపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంభం నుండే నలుగురు పోటీ చేస్తున్నారు.  చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి పోటీ చేస్తుండగా, ఆయన బావమరిది బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపురం నుంచి రెండోసారి బరిలోకి దిగుతున్నారు. చంద్రబాబు కొడుకు, మంత్రి లోకేశ్ గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల సమరంలో అడుగుపెట్టారు. లోకేష్ తోడల్లుడు, బాలకృష్ణకు రెండో అల్లుడు విశాఖపట్నంకు చెందిన భరత్ విశాఖ ఎంపీ స్థానం నుంచి పోటీకి దిగుతున్నారు. ఇలా చంద్రబాబు కుటుంబంలో నలుగురు ఈసారి ఎన్నికల క్షేత్రంలో పోటీచేస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన ఎర్రంనాయుడి  మరణం తర్వాత రాజకీయ అరంగ్రేటం చేసి శ్రీకాకుళం ఎంపీగా ఉన్న ఎర్రంనాయుడు కుమారుడు రామ్మోహన్‌నాయుడు రెండోసారి పోటీలోకి దిగుతున్నారు. ఎర్రంనాయుడు సోదరుడు, రామ్మోహన్‌నాయుడు బాబాయ్, మంత్రి అచ్చెన్నాయుడు టెక్కలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీలో ఉన్నారు. అదేవిధంగా రామ్మోహన్‌నాయుడు సోదరి ఆదిరెడ్డి భవానీ రాజమండ్రి అర్బన్ నుంచి పోటీపడుతున్నారు. ఆయన మామ బండారు సత్యనారాయణమూర్తి పెందుర్తి నుంచి బరిలోకి దిగుతున్నారు.  

మంత్రులుగా ఉన్న వియ్యంకులు  గంటా శ్రీనివాసరావు, నారాయణ ఇద్దరూ తాజా ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. గంటా విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా.. నెల్లూరు అర్బన్ స్థానం నుంచి నారాయణ బరిలోకి దిగుతున్నారు. గంటా మరో వియ్యంకుడు రామాంజనేయులు తిరిగి భీమవరం నుంచి పోటీచేస్తున్నారు.

కేంద్ర మాజీ మంత్రి అశోక గజపతిరాజు విజయనగరం ఎంపీ స్థానం నుంచి బరిలో ఉండగా  ఆయన కుమార్తె విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇదే జిల్లా ఎచ్చెర్ల నుంచి పోటీచేస్తున్న కిమిడి కళా వెంకట్రావు సోదరుడి కుమారుడు కిమిడి నాగార్జున చీపురుపల్లి నుంచి పోటీచేస్తున్నారు. అరకు అభ్యర్థి కిడారి శ్రావణ్‌కు పాడేరు అభ్యర్థి గిడ్డి ఈశ్వరి వరుసకు పెద్దమ్మ. కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ స్థానం నుంచి దేవినేని అనివాష్ పోటీచేస్తుండగా.. ఆయన బాబాయ్, మంత్రి దేవినేని ఉమ మైలవరం నుంచి అసెంబ్లీకి పోటీకి దిగుతున్నారు. 

గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్ వియ్యంకులు. వీరిద్దరూ తాజా ఎన్నికల్లో అవే స్థానాల నుంచి పోటీచేస్తున్నారు. అనంతపురం జిల్లాలో జేసీ వారసులు, వరుసకు సోదరులైన జేసీ పవన్, ఆస్మిత్‌రెడ్డి తాజా ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. జేసీ పవన్ అనంతపురం ఎంపీగా, తాడిపత్రి అసెంబ్లీ స్థానం నుం చి ఆస్మిత్‌రెడ్డి బరిలోకి దిగుతున్నా రు. కేఈ వారసులు, వరుసకు సోదరులు కూడా తాజా ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. పత్తికొండ నుంచి కేఈ శ్యామ్, డోన్ నుంచి కేఈ ప్రతాప్ పోటీలో ఉన్నారు.

మంత్రి అఖిలప్రియ ఆళ్లగడ్డ నుంచి, వరుసకు సోదరుడు అయిన బ్రహ్మానందరెడ్డి నంద్యాల నుంచి బరిలోకి దిగుతున్నారు.రాజ్యసభ సభ్యుడిగా ఉన్న టిజి వెంకటేష్ కుమారుడు టిజి భరత్ కర్నూల్ అసెంబ్లీ నుండి పోటీ చేస్తున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీగా పోటీచేస్తున్న శివానందరెడ్డి, పాణ్యం నుంచి అసెంబ్లీ బరిలో నిలిచిన గౌరు చరితారెడ్డి అన్నా చెళ్లెల్లు. కర్నూలు ఎంపీగా కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి పోటీచేస్తుండగా, ఆయన సతీమణి కోట్ల సుజాతమ్మ ఆలూరు అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిచారు. 

పలమనేరు నుంచి పోటీచేస్తున్న అమర్‌నాథ్‌రెడ్డి, పుంగనూను నుంచి బరిలో నిలిచిన అనూషారెడ్డి బావామరదళ్లు. ఇలా టీడీపీ జాబితా బంధుగణంతో అల్లుకుపోవడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.