భారత బలగాలను కించపరిచేలా మాట్లాడటం సిగ్గుచేటు

పాకిస్థాన్‌లోని బాలాకోట్‌పై భారత వాయుసేన జరిపిన దాడుల వాస్తవికతను ప్రశ్నిస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శామ్‌ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రంగా మండిపడ్డారు. భారత బలగాలను కించపరిచేలా మాట్లాడటం సిగ్గుచేటని ప్రధాని దుయ్యబట్టారు. శామ్‌ పిట్రోడా వ్యాఖ్యల నేపథ్యంలో మోదీ వరుస ట్వీట్లలో కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు.

‘ఉగ్రదాడికి దీటుగా బదులివ్వడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని యావత్ దేశానికి ఎప్పుడో తెలుసు. ఇప్పుడు ఆ విషయాన్ని కాంగ్రెస్‌ రాజ వంశానికి విశ్వసనీయమైన వ్యక్తి కూడా ఒప్పుకున్నారు'అంటూ ఎద్దేవా చేశారు.  కానీ ఇది నవ భారతం. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఉగ్రవాదులకు వారి భాషలోనే మేం సమాధానం చెప్పాం. ఉగ్రవాదుల పక్షాన మాట్లాడటం, మన సాయుధ బలగాలను ప్రశ్నించడం ప్రతిపక్షాల సహజ నైజం అంటూ ధ్వజమెత్తారు.

కశ్మీర్‌ రక్షణ కోసం ప్రాణత్యాగం చేస్తున్న జవాన్లను ప్రతిపక్ష నేతలు కించపరుస్తున్నారని ప్రధాని మండిపడ్డారు. మన భద్రతా బలగాలను ప్రతిపక్షం మళ్లీ అవమానిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఈ దేశ ప్రజలను నేను కోరుకునేది ఒక్కటే.. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతలను ప్రశ్నించండి. ఇలాంటి అవమానకర వ్యాఖ్యలను ఎప్పటికీ క్షమించబోమని వారికి అర్థమయ్యేలా చెప్పండి"అంటూ పిలుపిచ్చారు. 

జవాన్లకు ఈ దేశం ఎప్పటికీ అండగా నిలుస్తుందని మోదీ స్పష్టం చేశారు. బాలాకోట్‌ ఉగ్రస్థావరాలపై భారత్ జరిపిన వైమానిక దాడులను శామ్‌ పిట్రోడా ప్రశ్నించడం రాజకీయంగా పెను దుమారం రేపింది. ‘అసలు మనం దాడి చేశామా.. 300 మందిని చంపామా? ఈ దాడులకు ఆధారాలు చూపాలి, వాస్తవాలు తెలియజేయాలి’ అంటూ శామ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మోదీ కాంగ్రెస్‌ను తీవ్రంగా దుయ్యబట్టారు.