బీజేపీలో చేరిన గౌతమ్‌గంభీర్‌

టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ బిజెపిలో చేరారు. దేశ రాజధాని దిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ సమక్షంలో గంభీర్‌ ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కొంతకాలంగా గంభీర్‌ బీజేపీలో చేరతారనే వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. వాటికి గంభీర్‌ తాజాగా తెరదించారు. 

కాగా గంభీర్‌ను దిల్లీలోని ఓ స్థానం నుంచి లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దింపాలని బిజెపి భావిస్తున్నట్లు ఇప్పటికే దిల్లీకి చెందిన ఓ సీనియర్‌ నేత ప్రకటించారు. ఈ సందర్భంగా గంభీర్‌ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వం నచ్చి తాను బీజేపీలో చేరుతున్నానని, ఈ అవకాశం ఇచ్చినందుకు గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.

దేశ సమగ్రతకు సంబంధించిన అంశాలపై స్పందించేందుకు గంభీర్‌ ఎప్పుడూ ముందుంటారు. ఇటీవల పుల్వామా ఉగ్రదాడి, అనంతరం భారత వాయుసేన నిర్వహించిన ఎయిర్‌ స్ట్రైక్స్‌, వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ భారత్‌కు తిరిగి రావడం లాంటి విషయాల్లో చురుగ్గా స్పందించారు.

పుల్వామా దాడి అనంతరం గంభీర్‌ మాట్లాడుతూ.. ప్రపంచకప్‌లో టీమిండియా పాక్‌తో మ్యాచ్‌ ఆడొద్దని సూచించారు. పాకిస్థాన్‌తో ఆడకపోతే రెండు పాయింట్లు మాత్రమే పోతాయని, అమర జవాన్ల ప్రాణాలకన్నా.. క్రికెట్‌ ఎక్కువేం కాదని తేల్చిచెప్పారు.