మోదీ హయాంలో బలపడిన భారత్‌-అమెరికా సంబంధాలు

మోదీ హయాంలో భారత్‌-అమెరికా మధ్య సంబంధాలు బలపడాయని శ్వేతసౌధానికి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. లోక్‌సభ ఎన్నికల తరవాత ఈ సంబంధాలు మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. గతేడాది ఇరు దేశాల మధ్య జరిగిన ‘టూ ప్లస్‌ టూ’ చర్చలు సత్సంబంధాలు మరింత ముందుకెళ్లేలా దోహదపడ్డాయని స్పష్టం చేశారు.

2017లో మోదీ అమెరికా పర్యటన కూడా సంబంధాల మెరుగులో కీలక పాత్ర పోషించిందని తెలిపారు. ఇటీవల విదేశాంగ శాఖ ప్రధాన కార్యదర్శి విజయ్‌ గోఖలే జరిపిన పర్యటన వాటికి కొనసాగింపేనని చెప్పారు. సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ మైక్‌ పాంపియో నుంచి అమెరికా భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్‌ వరకూ ప్రతి ఒక్కరితో గోఖలే కీలక చర్చలు జరిపారని వెల్లడించారు. 

రానున్న ఎన్నికల్లో ఎవరు గెలుపొందినా.. భారత్‌తో సత్సంబంధాలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. వ్యూహాత్మకంగా భారత్‌తో బంధం అమెరికాకు చాలా కీలకమని స్పష్టం చేశారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికా వ్యూహాత్మక కదలికలకు భారత్‌ నుంచి తోడ్పాటు లభించడం వైపు దృష్టి సారించామని తెలిపారు. ఇటీవల జరిగిన గోఖలే అమెరికా పర్యటన సందర్భంగా భారత్‌-పాక్ సంబంధాలపై కూడా చర్చలు జరిగాయని పేర్కొన్నారు. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో మున్ముందు అనుసరించాల్సిన వ్యూహాలపై వారు చర్చించారని తెలిపారు.

 మరోవంక, జైష్‌ ఎ మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ నేత మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడానికి చైనా మోకాలడ్డడంపై అమెరికా తీవ్ర నిరాశకు గురైందని శ్వేత సౌధానికి చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ విషయంలో పాకిస్థాన్‌కు చైనా మద్దతుగా నిలవడాన్ని ఆయన తప్పుబట్టారు. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాల్సిందేనని ఐరోపా సమాఖ్యలో జర్మనీ తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా అమెరికా ఈ వ్యాఖ్యలు చేసింది.

ఉగ్రవాదంపై చర్యలు తీసుకునేలా పాకిస్థాన్‌పై ఒత్తిడి పెంచే బాధ్యత చైనాపై ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఉగ్రవాద నిర్మూలనకు పాక్‌ పటిష్ఠ చర్యలు తీసుకోవాలన్న ప్రపంచ దేశాల నినాదానికి చైనా కూడా తన గళాన్ని జోడించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.  ఉగ్రవాద నిర్మూలనపై అమెరికా, చైనా పరస్పరం సహకరించుకోవాలని ఇప్పటికే నిర్ణయించామని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో మసూద్‌ అంశంలో చైనా తీరు ఇరు దేశాల లక్ష్యానికి విఘాతం కలిగించే అవకాశం ఉందని పేర్కున్నారు.

గుర్తింపు పొందిన ఉగ్రసంస్థలను ఏరివేయడానికి వెనకాడుతున్న పాకిస్థాన్‌కు చైనా ఎందుకు మద్దతుగా నిలస్తుందో అర్థం కావడం లేదని ప్రశ్నించారు. ఇకనైనా శాంతి, సుస్థిరతను నెలకొల్పడంలో చైనా సహకరించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఐరాస భద్రతామండలిలోని మూడు శాశ్వత సభ్యత్వదేశాలు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఇంతకుముందు పలుమార్లు ఈ దిశగా చేసిన ప్రయత్నాలు.. చైనా వీటో చేయడంతో వీగిపోయాయి. నాలుగోసారి కూడా ‘టెక్నికల్‌ హోల్డ్‌’ పేరిట చైనా అడ్డంకులు సృష్టించింది. అయితే మసూద్‌ అంశంలో భారత్‌ ఆవేదనను అర్థం చేసుకోగలమని.. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని చైనా రాయబారి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.