హర్యానాలో పోటీకి కాంగ్రెస్ సీనియర్ల దూరం!

హర్యానాలో కాంగ్రెస్ పార్టీ చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయడానికి సీనియర్లు ఎవరూ ముందుకురాకపోవడంతో అభ్యర్థుల వేటలో పడ్డారు. ఇటీవల జింద్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో ఎన్నికలంటే నాయకులు దూరంగా ఉంటున్నారు.

నిత్యం అంతర్గత కుమ్ములాటలతో సతమతమయ్యే పార్టీని గాడిలో పెట్టడానికి అధిష్ఠానం చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. పార్టీని చక్కదిద్దడానికి కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఢిల్లీలో జరిగిన సమన్వయ కమిటీ తొలి సమావేశంలో లోక్‌సభ ఎన్నికల పట్ల సీనియర్లు ఆసక్తిచూపలేదు. మాజీ సీఎం భూపీందర్ సింగ్ హూడా నేతృత్వంలో 16మంది సభ్యులతో సమన్వయ కమిటీ ఏర్పాటైంది.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు కుల్‌దీప్ బిష్ణోయ్ అధినాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని కినుక వహించి ఢిల్లీ సమావేశానికి గైర్హాజరయ్యారు. అలాగే సీనియర్ నాయకులు నవీన్ జిందాల్, కుల్‌దీప్ శర్మ, కుమారి సెల్జా కూడా లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపడం లేదు. హర్యానాలో పది లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ దృష్టంతా అసెంబ్లీ ఎన్నికలపైనే ఉంది. అక్టోబర్ లేదా నవంబర్‌లో హర్యానా అసెంబ్లీకి ఎన్నికలుంటాయి. అయితే పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని భూపీందర్ చెబుతున్నారు.

భూపీందర్ కుమారుడు దీపేందర్ సింగ్ హుడా రొహ్‌తక్ నుంచి నాలుగోసారి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. బిష్ణోయ్ విషయానికి వస్తే ఈనెల 12న అహ్మదాబాద్‌లో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఆయన కుమారుడు భావ్య మాత్ర హిస్సార్ నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. జింద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాజయం ఎదురైంది. 

సిట్టింగ్ ఎమ్మెల్యే కైతాల్ రణదీప్ సింగ్ సుర్జేవాలా ఓటమి పాలయ్యారు. సర్జేవాలా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కమ్యూనికేషన్ విభాగం అధినేతగా ఉన్నారు. ఉప ఎన్నికల్లో ఆయన మూడో స్థానం దక్కింది. బీజేపీ అభ్యర్థి క్రిషన్‌లాల్ మిద్దా ఘన విజయం సాధించారు. జననాయక్ జనతాపార్టీ (జేజీపీ) అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ చౌతాలా రెండో స్థానంలో నిలిచారు. హైకమాండ్ ఆదేశాల మేరకు సుర్జేవాలా ఉప ఎన్నికల్లో నిలబడ్డారు. ఉప ఎన్నికల్లో జాట్, జాట్ యేతర సామాజికవర్గాలుగా విడిపోయారు. ఇప్పుడు ఇవే సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని పార్టీలు ముందుకెళ్తున్నాయి. 

పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆజాద్ ఈనెల 26 నుంచి 30 వరకూ బస్ యాత్రను చేపట్టనున్నారు. ఫరీదాబాద్ నుంచి ఝజ్జర్ వరకూ యాత్ర సాగుతుంది. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని ఏకతాటిపైకి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఆజాద్ యాత్ర చేస్తున్నారు.