రెండు నెలల్లో రూ.40 వేల కోట్లకు పైగా విదేశీ సంస్థాగత పెట్టుబడులు

దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి విదేశీ సంస్థాగత పెట్టుబడులు కొనసాగుతున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ సర్కార్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయంటూ పలు సర్వేలు వెల్లడించడంతో ఎఫ్‌ఐఐలు భారీగా నిధులను కుమ్మరిస్తున్నారు. గడిచిన రెండు నెలల్లోనే ఈక్విటీ, డెబిట్ మార్కెట్లలోకి ఎఫ్‌ఐఐలు రూ.40 వేల కోట్లకు పైగా నిధులను కుమ్మరించారు. 

పాకిస్తాన్‌పై వైమానిక దాడులు జరుపడంతో నరేంద్ర మోదీ సర్కార్‌పై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగింది. దీంతో వచ్చే ఎన్నికల్లో నిలకడైన ప్రభుత్వం వస్తున్నదన్న అంచనాలు ఎఫ్‌ఐఐలకు జోష్‌నిచ్చింది. ముందస్తు అంచనాలతో ఎన్నికలకు ముందు స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకుంటున్నాయి. దీంతో గడిచిన నెల రోజుల్లో బీఎస్‌ఈ సెన్సెక్స్ 3,000 పాయింట్లు, నిఫ్టీ 900 పాయింట్ల వరకు లాభపడ్డాయి. 

మార్కెట్ల ర్యాలీ వెనుక ఎఫ్‌ఐఐలు కీలక పాత్ర పోషిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో నిలకడైన ప్రభుత్వం రానుండటంతో సంస్కరణలకు పెద్దపీట వేయనున్న అంచనా పుంజుకోవడానికి దోహదపడ్డాయని యాంజిల్ బ్రోకింగ్ మేనేజర్ మయురేష్ జోషి తెలిపారు. 
అగ్రరాజ్యం అమెరికా-చైనా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్యయుద్ధ పరిస్థితులు సద్దుమనుగడం, క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం కూడా మార్కెట్లు పెరుగడానికి ప్రధాన కారణమని ఆయన విశ్లేషించారు. మరోవైపు రూపాయి స్థిరంగా కొనసాగుతుండటం, ద్రవ్యోల్బణం అదుపులో ఉండటంతో స్టాక్ మార్కెట్లలో సెంటిమెంట్ మెరుగుపడిందని చెబుతున్నారు.

జాతీయ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ అయితే కేవలం 69 ట్రేడింగ్ సెషన్లలోనే 10,600 పాయింట్ల నుంచి 11,500 పా యింట్లకు ఎగబాకింది. బ్యాంకింగ్, ఆర్థికం, రియల్టీ, ఇంధనం, ఇన్‌ఫ్రా, ఐటీ రంగాల నుంచి వచ్చిన దన్నుతో నిఫ్టీ వెయ్యి పాయింట్లకు పైగా పుంజుకున్నది.